మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు ఎన్సీఎల్టీ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గట్టి షాక్‌నిచ్చింది. పూర్తిచేసిన పనులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎగవేసినందుకు మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాళా పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ)కు ఎన్సీఎల్టీ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళి ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) కోసం సొరంగ తవ్వకాల పనుల్లో భాగంగా అనిక్ పంజర్పోల్ లింక్ రోడ్ పనులను చేపట్టేందుకు మధుకాన్ ప్రాజెక్ట్స్‌తో శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ కంపెనీ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ 2014 నాటికి రూ.4.02 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. అయితే మధుకాన్ ఈ పనులకు కేవలం రూ.96 లక్షలు మాత్రమే చెల్లించింది.
మిగిలిన బకాయిల కోసం మధుకాన్‌కు శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ పలుమార్లు నోటీసులు పంపింది. అయినా ప్రయోజనం లేకపోవటంతో మధుకాన్ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఆ కంపెనీ హైద రాబాద్లోని ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. మధుకాన్ తమకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయి ందని ఆ కంపెనీ తరఫు న్యాయవాది వివరించారు. చేసిన పనులకు ఎంఎంఆర్డీఏ డబ్బు చెల్లించినా మధుకాన్ మాత్రం తమకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బెంచ్ ముందుంచారు. వీటిని పరిశీలించిన సభ్యులు చెల్లించాల్సిన బకాయిలను మధుకాన్ ప్రాజెక్ట్స్ చెల్లించలేదని నిర్ధారించుకున్నారు. మధుకాన్ దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. తాత్కాలిక దివాళా పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) రాకేష్ రాఠీని నియమించారు. మధుకాన్ ప్రాజెక్ట్స్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించారు.