మరో నలుగురు కమిషనర్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంపై తలెత్తిన వివాదంతో ఇప్పటికే నలుగురిపై వేటు వేసిన హైకోర్టు, మరో నలుగురు కమిషనర్లు మధుకర్‌రాజ్, ప్రభాకర్‌రెడ్డి, రతన్, విజయబాబులకు కూడా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అశుతోష్ మొహంతా, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లుగా పైన పేర్కొన్న వారి నియామకం రాజ్యాంగానికి, సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని, వారి నియామకాన్ని కొట్టివేయాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు సి.జె.కరీరా, భార్గవి తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కమిషనర్ల నియామకంలో పారదర్శకత లోపించిందని, రాజకీయ కారణాలతోనే వీరి నియామకాలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.