మధురవీణ వర్సెస్ సోనియా!
ఇద్దరు ఐపీఎస్ మహిళా అధికారులు మధ్య గొడవ కర్ణాటకలో దుమారం రేపుతున్నది. సీఐడీ ఎస్పీ మధురవీణ, సీఐడీ డీఐజీ సోనియా నారంగ్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీఐజీ సోనియా నారంగ్‌పై మధుర వీణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
సీఐడీ ఎస్పీ మధురవీణ బ్లాక్ మెయిల్‌కు పాల్పడి.. ఓ హోటల్ మేనేజ్మెంట్ నుంచి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యభిచారం జరుగుతుందన్న అనుమానంతో మార్చి 3న బెంగళూరు కన్నింగ్‌హామ్ రోడ్డులోని ఆర్చిడ్ రమదా స్టార్ హోటల్‌పై మధురవీణ నేతృత్వంలో పోలీసుల దాడి జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హోటల్లోని గది నంబర్ 306పై పోలీసులు దాడి చేశారు. గదిలో ఇద్దరు అమ్మాయిలు దొరికారు. దీంతో రూ. 5 లక్షలు ఇవ్వాల్సిందిగా మధురవీణ హోటల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేసిందని, అయితే, చర్చల ద్వారా సెటిల్ చేసి రూ. 2 లక్షలకు డీల్ చేసుకొని, ఈ వ్యవహారాన్ని ముగించినట్టు మధురవీణపై ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో హోటల్ ఆరోపణలు, సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా సీఐడీ డీఐజీ సోనియా నారంగ్ మధురవీణకి వ్యతిరేకంగా డీజీపీకి దర్యాప్తు నివేదిక అందజేశారు. హోటల్ మేనేజ్మెంట్ కూడా కర్ణాటక డీజీపీ ఓంప్రకాశ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీపీ కిషోర్ చంద్ర ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన సోనియా నారంగ్ తనను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్నదని, తనను ఆమె వేధిస్తున్నదని ఏకంగా బాస్‌పైనే మధురవీణ కేసు పెట్టడంతో కర్ణాటకలో పోలీసు శాఖలో కలకలం రేపుతున్నది.