దటీజ్ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్ అయ్యే గెలుపు..
బాల్యమంతా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉంది. స్నేహితులను కోల్పోయింది. ఓ పేషెంట్లా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నా.. వెరవక చదువుని కొనసాగించింది. అంతటి స్థితిలోనూ మంచి మార్కులతోనే పాసయ్యింది. ఓ పక్కన ఆ మహమ్మారి నుంచి కోలుకుంటూనే నీట్కి ప్రిపర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కేన్సర్ అనంగానే సర్వం కోల్పోయినట్లు కూర్చొనవసరం లేదు. సక్సెస్‌తో చావు దెబ్బతీస్తూ బలంగా బతకాలని చాటి చెప్పింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే మధురిమ బైద్య. ఆరవ తరగతిలో ఉండగా అంటే.. 12 ఏళ్ల ప్రాయంలో అరుదైన నాన్-హాడ్కిన్స్ లింఫోమా కేన్సర్ బారిన పడింది. అది కూడా స్టేజ్ 4లో ఉండగా వైద్యులు ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్(Tata Memorial Hospital) చుట్టూ తిరుగడంతోనే బాల్యం అంతా గడిచిపోయింది. కనీసం స్నేహితులు కూడా లేరు మధురిమకు. అయినా సరే చదువుని వదల్లేదు. ఆ ఆస్పత్రి ఓపీడీల్లో చదువుకునేది. ఆఖరికి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యినప్పుడూ పుస్తకాలను వదలేది కాదు. అలా చదువుతోనే మమేకమయ్యేలా తన బ్రెయిన్‌ని సెట్ చేసుకుంది. నిజానికి ఆ దశలో ఉండే కీమోథెరపీలు మోతాదు అంతా ఇంత కాదు. చదివినా బుర్ర ఎక్కదు కూడా. కానీ మధురిమ ఆ బాధని కూడా లెక్కచేయకుండా చదువు మీద ధ్యాసపెట్టి దొరికిన కొద్ది సమయంలోనే చదువుకుంటుండేది. ఆమె కష్టానికి తగ్గట్టు పదోతరగతిలో 96% మార్కులతో పాసై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇంటర్ కూడా 91% మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తను ఇంతలా కష్టపడి చదవడటానికి కారణం.. తనలాంటి కేన్సర్ బాధతులందరికీ ఓ ప్రేరణగా ఉండాలనేది ఆమె కోరకట. అందుకోసమే తనను తాను వ్యాధిగ్రస్తురాలిగా లేదా బాధితురాలిగా అస్సలు బావించేదాన్ని కాదని అంటోంది. తన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు జీవితంపై పోరాడుతున్న యోధురాలిగా అనుకుని ముందుకు సాగానని సగర్వంగా చెబుతోంది మధురిమ. తన కెరీర్ అంతా ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లతోనే పోరాడింది. సంవత్సరాల తరబడి సాగిన కీమోథెరపీ(chemotherapy), రేడియేషన్(Radiation), ఎముక మజ్జ మార్పిడి(Bone marrow transplant) వంటి కఠినతరమైన శస్త చికిత్సలతో కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. కానీ వాటి కారణగా శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనమైంది. అందువల్ల తరుచుగా జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల బారినపడుతుండేది. అయినా సరే చదువుని ఆపలేదు. ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2024)కి కూడా ప్రిపేర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇక్కడ మధురిమ కేన్సర్ చివరిదశలో పోరాడుతున్న నైరాశ్యాన్ని దరిచేరనివ్వలేదు. పైగా తన కలను సాకారం చేసుకునే సమయంలో ఎదురవ్వుతున్న కఠినమైన ఆరోగ్య సవాళ్లన్నింటిని తట్టుకుంటూనే మంచి మార్కులతో పాసయ్యింది. అదీగాక అత్యంత కఠినతరమైన నీట్ ఎగ్జామ్‌ని అలవోకగా జయించింది. మధురిమ సక్సస్ జర్నీ చూస్తే..దృఢ సంకల్పం, మొక్కవోని పట్టుదల ముందు..కఠినతరమైన కేన్సర్ కనుమరుగవుతుందని తేలింది. అంతేగాదు ఇక్కడ తన ఆరోగ్య పరిస్థితులన్నింటిని అంగీకరించిందే తప్ప 'నాకే ఎందుకు ఇలా' అనే ఆలోచన రానీయలేదు. అందుకు తగ్గట్టుగా తన సామార్థ్యాన్నిపెంపొందించటంపై దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మధురిమ గెలుపు మాములుది కాదని ప్రూవ్ చేసింది. (చదవండి: గర్భధారణ సమయంలో ఎటాక్ చేసే వ్యాధి..! హాలీవుడ్ నటి సైతం..)