'ప్రతి మహిళ ముఖ్యమంత్రే'
తాను ముఖ్యమంత్రి పదవి అలంకరించడంతో రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆ పదవిని చేపట్టినట్లు భావిస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ వెల్లడించారు. గురువారం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకత్వం తనకు పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు.
ఆ బాధ్యతను త్రీకరణశుద్ధీతో పని చేస్తానని తెలిపారు. గురువారం గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఆ రాష్ట్ర గవర్నర్ కమల బెనివల్... ఆనందీ బెన్ పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి ఆనందీ భర్త మఫత్లాల్, ఆమె కుమార్తె అనార్లు హాజరైయ్యారు. అనార్ మాట్లాడుతూ ... తల్లి సీఎం పీఠం అధిష్ఠించిన తరుణం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు, తన కుటుంబానికి ఈ విషయం గర్వంగా భావిస్తున్నామని ఆనందీ భర్త మఫత్లాల్ తెలిపారు.
గతంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పలు కీలక శాఖలలో పని చేసిన ఆనందీ బెన్ పటేల్ గురువారం గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న మోడీ భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే.