అపూర్వమైన ఐంద్రజాలికురాలు
ప్రతిభా కిరణం
కర్నాటకలోని మంగళూరుకు చెందిన ఏడు సంవత్సరాల అపూర్వ ఇంద్రజాలంలో అసాధారణ ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలను సృష్టిస్తోంది. అపూర్వ రెండు సంవత్సరాల వయసులో మ్యాజిక్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఐదేళ్లకేదాదాపు 400 ప్రదర్శనలు ఇచ్చింది. ఎంతో నైపుణ్యం కలిగిన ఐంద్రజాలికులు ప్రదర్శించే హైడ్ అండ్ ఎస్కేప్ను ఈ సిసింద్రీ మూడు సంవత్సరాల వయసులోనే ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 10 తాళాలు వేసిన 10 అడుగుల పొడవైన గొలుసుతో ఆమె శరీరాన్ని చుడితే దాని నుండి సునాయాసంగా బయటపడి విజయం సాధించింది. నాలుగు సంవత్సరాల వయసులోనే కళ్ళకు గంతలు కట్టుకుని ఎలక్ట్రిక్ బైక్ నడిపింది.
ఆమె వయసువారు బొమ్మలతో ఆడుకుంటుంటే అపూర్వ మాత్రం ఐంద్రజాల మాంత్రికులైన తన తల్లిదండ్రుల దగ్గర తన ఇంద్రజాల విద్యకు మెరుగులు దిద్దుకోసాగింది. అలా ఆమెకు ఇల్లే మ్యాజిక్ పాఠశాలగా మారిపోయింది.
అపూర్వ ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడపగలదు. గొలుసుల మధ్య బంధిస్తే అందులోంచి తప్పించుకోగలదు. ఖాళీ డబ్బాల్లోంచి చాక్లెట్లు సృష్టించగలదు. రుమాలును గాలిలో ఊపి పావురాన్ని తెప్పించగలదు. ఇలా ఎన్నో మాంత్రిక కృత్యాలు చేయగలదు.
2013లో జరిగిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్లో కె.లాల్ మెమోరియల్ ట్రోఫీ ఇచ్చి అపూర్వని సన్మానించారు.