నేత్రపర్వం
విజయవాడ(వన్‌టౌన్):
మహాభారతంలోని గయోపాఖ్యనం సన్నివేశాన్ని కళాకారులు అత్యద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న కళారూపాలలో భాగంగా మంగళవారంనాటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గుడివాడకు చెందిన వల్లూరి శ్రీహరిరావు బృందం గయోపాఖ్యానం పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. చక్కని నటనతోపాటుగా మధురమైన గానంతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఈ నాటకానికి వల్లూరి శ్రీహరిరావు దర్శకత్వం వహించి నటించగా మిగిలిన పాత్రల్లో సోము అంజిరెడ్డి, సాలువాచారి, జంగయ్యగౌడ్, ఎన్.చంద్రబాబు, కోటేశ్వరరావు తదితర పాత్రల్లో నటించి మెప్పించారు. బీటీ నాయుడు చక్కని ఆహార్యాన్ని అందించారు. నగరానికి చెందిన వై.గోపాలరావు బృందం సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించింది. దీనికి గోపాలరావు దర్శకత్వం వహించి కీలకపాత్ర పోషించగా మిగిలిన పాత్రల్లో కె.మంగాదేవి, పద్మావతి, తవిటి నాయుడు, ఎంఎల్ రమణలు నటించి అలరించారు. తొలుత డాక్టర్ ఎస్పీ భారతి బృందం కూచిపూడి నాట్యాంశాలను ప్రదర్శించారు. ఒంగోలుకు చెందిన శ్రీనళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్కు చెందిన కళాకారులు కూచిపూడికేళిక రూపకాన్ని ప్రదర్శించారు. అలరింపు, తిళ్లానా తదితర అంశాలను చూడముచ్చటగా ప్రదర్శించారు. కె.శ్రావ్య, సురేష్‌బాబు, స్రవంతి, లాస్య, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. నగరానికి చెందిన దామోదర గణపతిరావు జానపదాలు జనరంజకంగా సాగాయి. గణపతిరావు బృందం పలు జానపదాలను గానం చేస్తూ నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ఆయన బృందంలో గణపతిరావుతో పాటుగా కొంపల్లి బాలకృష్ణ, సతీష్, సుజాత, పరమేష్, ఫణి తదితరులు పాల్గొన్నారు. కళాకారులను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ అభినందించారు.