అమ్మ కళ్లల్లో కన్నీళ్లు లేవు..
గోడచేర్పు బతుకుల్లేవు.. చీకటి జీవితాల్లేవు..
ఈసడింపుల్లేవు.. వెటకారాల్లేవు..
చిత్రమైన చూపుల్లేవు.. చెత్త కామెంట్లూ లేవు..
ఆనందముంది.. వెలుగుంది..
స్కూలు ఉంది.. చదువుంది..
ఆశల నడకుంది.. అలుపెరగని పరుగుంది..
జీవమే కాదు.. జీవితమూ ఉంది..
ఎందుకంటే.. మహేందర్ తలెత్తుకుని నిలబడ్డాడు!!
మహేందర్ అహివార్(13). మధ్యప్రదేశ్‌లోని చాటీపహాడీ లో ఉంటాడు. పుట్టినప్పుడు అందరి పిల్లల్లాగే మామూలుగానే ఉన్నాడు. తర్వాత మెడ క్రమంగా పక్కకు వంగిపోవడం ప్రారంభమైంది. దీంతో అతడి మెడతోపాటు జీవితం కూడా తలకిందులైంది. ఒక అరుదైన పరిస్థితి వల్ల మహేందర్ మెడ కండరాలు బలహీనపడిపోయాయి. తల్లిదండ్రులు చాలా మందికి చూపించారు. ఫలితం లేదు. మహేందర్ జీవితం ఇంటికే పరిమితమైపోయింది.
నిలబడే పరిస్థితి ఉండేది కాదు.. అలా గోడకు ఆనుకుని ఉండేవాడు. తినాలన్నా.. బాత్రూంకు పోవాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే. తోటివారంతా స్కూలుకెళ్తుంటే.. తాను ఇంట్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి. స్నేహితుల్లేరు.. పలకరించేవారే లేరు.. మహేందర్ బాధ చూసి.. అతడి తల్లిదండ్రులైతే.. ఇంతకన్నా వాడికి మరణమే మేలని అనుకున్న రోజులూ ఉన్నాయి.
రోజులు మారాయి. మహేందర్ పరిస్థితి గురించి పత్రికల్లో చూసిన ఢిల్లీ అపోలో ఆస్పత్రి వైద్యుడు రాజగోపాలన్ కృష్ణన్.. అతడిని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. అటు నెట్లో ఇతడి పరిస్థితి చూసి చలించిపోయింది బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన జూలీ. ఆమె మహేందర్ పరిస్థితిని వివరిస్తూ.. ఆపరేషన్ నిమిత్తం రూ.10 లక్షల మేర విరాళాలు సేకరించింది. అంతే.. ఆపరేషన్ పూర్తయింది.. మహేందర్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇన్నాళ్లలా ప్రపంచం తలకిందులుగా లేదు.. నిటారుగా ఉంది.. తన తలలాగే.. తలెత్తుకునే ఉంది..