పెళ్లి రోజే గృహిణి ఆత్మహత్య
భర్తే హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
అత్త మామలు, భర్త అరెస్టు
కాటేదాన్, న్యూస్‌లైన్: తాగుబోతు భర్త వే ధింపులు తట్టుకోలేక ఓ గృహిణి పెళ్లిరోజే తనువు చాలించింది. మైలార్‌దేవ్‌పల్లి ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తకోటకు చెందిన నరేందర్‌రెడ్డి(30), రాధ(26) భార్యాభర్తలు. వీరికి హేమంత్‌రెడ్డి(4), అవిక(8 నెలలు) సంతానం. కాగా వీరి కుటుంబం లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్ 2, ఫ్లాట్‌నెంబర్ 32లో స్థిరపడింది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే నరేందర్‌రెడ్డి తాగుడుకు బానిసై తరచూ భార్యను వేధించసాగాడు.
ఇదిలావుండగా, సోమవారం వీరి పెళ్లిరోజు కావడంతో ఇంటికి బంధువులు వచ్చారు. అంతా కలిసి గుడికెళ్లి వచ్చారు. అనంతరం రాత్రి బంధువులు డాబాపైన పడుకోగా, నరేందర్‌రెడ్డి, రాధలు ఇంట్లో పడుకున్నారు. అప్పటికే తాగినమైకంలో ఉన్న భర్త రాధను తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన నరేందర్‌రెడ్డి.. రాధ మృతదేహాన్ని కిందకు దింపి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనను గుర్తించిన బంధువులు, స్థానికులు నరేందర్‌రెడ్డికి దేహశుద్ధి చేయగా, జరిగిన విషయాన్ని వెల్లడించాడు. అయితే, రాధను భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
మృతురాలి భర్త నరేందర్‌రెడ్డితో పాటు అత్తమామలు విమలమ్మ(45), నాగిరెడ్డి(50)లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లి మరణించి, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.