అక్రమాలే పునాదులు
బహదూర్‌పురా: పాతబస్తీ ఓల్డ్ ఖబూతర్‌ఖానాలో ఇద్దరి మృతికి కారణమైన మహేశ్వరి సేవా ట్రస్టు భవనం వెనుక అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు స్థలానికి ఎలాంటి అనుమతులు లేకపోగా, అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తూ ఇద్దరు కార్మికులను పొట్టనబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్వరి ట్రస్టు భవనంలో మొదటి అంతస్తు వరకు స్లాబ్ నిర్మించిన ఇంజనీర్, కాంట్రాక్టర్లు మధ్యలో ఎలాంటి ఆధారం లేకుండా కట్టెలు, గోవాల సహాయంతో రెండో అంతస్తులో స్లాబ్ వేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే కింద ఆధారం లేకపోవడంతో రెండో అంతస్తులో స్లాబ్ పనులను నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు.
గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే పనులు..
యజమానిగా చెప్పుకుంటున్న మహేశ్వరి సేవా ట్రస్టు ప్రతినిధి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రే పనులు చేపట్టారని జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివాదంలో ఉన్న ఈ స్థలంలో ఎలాంటి నిర్మా ణాలు చేపట్టరాదని తాము గతంలో ట్రస్టు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని, దీనిపై హుస్సేనీఆలం పీఎస్‌లో కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఆదినుంచి అక్రమాలే
వాస్తవానికి భవన నిర్మాణం చేపట్టిన స్థలం మహేశ్వరి సేవాట్రస్టుకుచెందినది కాకపోయినా తమదిగా పేర్కొం టూ సేవాట్రస్ట్ సభ్యులు మూడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతికోసం దరఖాస్తు చేసుకోగా టౌన్‌ప్లానింగ్ విభాగం 2015 ఆగస్టు 13న తిరస్కరించింది. అయినా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్ బంగ్, ఇతర సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిబ్రవరి 20న జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు. అక్రమాలను తొలగించేందుకు వెళ్లి న, అసిస్టెంట్ సిటీప్లానర్, సెక్షన్ ఆఫీసర్, సిబ్బందిపై శ్రీనివాస్ అతని అనుచరులు దాడులకు పాల్పడ్డారు. సిటీ సివిల్ కోర్టు ద్వారా ట్రస్టు సదరు స్థలంపై ఇంటెరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ పొందిందని, దీనిపై జూన్ 14న కోర్టులో విచారణ జరగాల్సి ఉందన్నారు. ఇంతలోనే హడావుడిగా అర్ధరాత్రి నిర్మాణం చేపట్టి ఇద్దరి మృతికి కారణమయ్యారని అధికారులు పేర్కొన్నారు.
చట్ట విరుద్ధంగా ట్రస్టు నిర్వహణ
జీహెచ్ఎంసీ సమాచారం మేరకు సదరు స్థలంపై ట్రస్ట్‌కు ఎలాంటి హక్కు లేదు. 1977లో ఏపీహెచ్‌బీ సదరు స్థలాన్ని ఎంసీహెచ్‌కు అప్పగించింది. దానిని నెథర్లాండ్ ఫౌండేషన్ సహకారంతో పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం ఇండో-డచ్ ప్రాజెక్టుకు కేటాయించారు.
సదరు ప్రాజెక్ట్‌కు దీనిపై యాజమాన్య హక్కు ఉండదని, ఎంసీహెచ్కే చెందుతుందని 1976లో ఎంసీహెచ్ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేశారు. అనంతరం ఇండో డచ్ కార్యక్రమాలను ‘ముఖ్య కుటుంబ వికాస కేంద్ర’కు బదిలీ చే శారు. దాని కాలపరిమితి ముగియడంతో మదర్ అండ్ చైల్డ్ కేర్ సొసైటీకి అప్పగించారు. చివరకు మహేశ్వరి సేవాట్రస్ట్ చట్టవిరుద్ధంగా ఎంసీహెచ్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు వివరించారు.
మృతుల బంధువుల ఆందోళన
ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్, ఇంజనీర్, భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఐటీయూ నాయకులు శేఖర్ యాదవ్ వారికి మద్దతు తెలుపుతూ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆపద్భంధు సాయం అందిస్తాం
ప్రమాదంలో మృతి చెందిన నందు, వెంకటయ్య కుటుంబ సభ్యులకు ఆపద్భాంధువు పథకం కింద రూ.50 వేలను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని బహదూర్‌పురా తహ శీల్ధార్ నవీన్ తెలిపారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ బాధితులను పరామర్శించారు
మరో ఇద్దరి పరిస్థితి విషమం
అఫ్జల్‌గంజ్: భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన ఎనిమిది మంది వ్యక్తులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాధితుల్లో దశరధ్, జయప్రకాష్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగతావారు శివకుమార్, లోకేష్, నరేష్, నలక్శ్రీను, చోటాలాల్, సయ్యద్ అలీ తదితరులకు ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స అందించి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.