Majeed Hussain
-
చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు
శాలిబండ: గ్రేటర్ పరిధిలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. కట్టడాల మరమ్మతులు, పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. శనివారం ఆయన చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో కలిసి చారిత్రక కట్టడమైన ‘ఖుర్షీద్ జా దేవుడీ’ని సందర్శించారు. ఈ కట్టడం పెచ్చులూడుతుండడాన్ని గమనించిన మాజిద్ హుస్సేన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచించారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేపట్టి వీటికి మరింత వన్నె తెస్తామన్నారు. ఈ పనులను కుడా ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు. దారుషిఫాలోని పాత పాస్‌పోర్టు కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. కార్యక్రమంలో హుస్సేనీ ఆలం కార్పొరేటర్ మీర్ జుల్ఫీకర్ అలీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులు అసద్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
నేడే పల్స్ పోలియో
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం 8 గంటలకు క్యాంప్ కార్యాలయంలో వాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బూతుల్లోనే కాకుండా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కుల్లోనూ సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో జనాభా: 47.49 లక్షలు ఐదేళ్ల లోపు చిన్నారులు: 6,56,454 మంది చుక్కల మందు వేసే కేంద్రాలు: 3208 తొలి రోజు వేయనివారికి 20,21,22 తేదీల్లోవేయనున్నారు. మేయర్ మాజీద్ హుస్సేన్ ఉదయం 8.30కి సయ్యద్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.