అభివృద్ధి ముసుగు.. అవినీతి కంపు
పెబ్బేరు, న్యూస్‌లైన్: జిల్లాలోనే అత్యధిక ఆదాయం కలిగిన పెబ్బేరు పంచాయతీ అవినీతికి అడ్డాగా మారింది. ప్రజాప్రతినిధులే కాదు.. ‘ప్రత్యేక’ పాలనలోనూ అవినీతి రాజ్యమేలింది. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ నిధులను ఖర్చుచేసి రికార్డును సృష్టించారు. నిధులను నీళ్లలా ఖర్చుచేశారే గాని వాటికి సంబంధించిన లెక్క లేదు..పత్రం చూపలేదు. పెబ్బేరు మేజర్ పంచాయతీకి ఏటా రూ.2.5 కోట్ల ఆదాయం ఉన్నా రికార్డుల నిర్వహణ లేని విషయమై ఆగస్టు 22న ‘ఆదాయం పైనే గురి.. లెక్కలపై లేదు మరీ!’ అనే శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
దీంతో కంగుతిన్న అధికారులు తమ ప్రత్యేకపాలనలో ఖర్చుచేసిన నిధులకు లెక్కలు చూసుకోవడం మొదలుపెట్టారు. చేసిన ఖర్చులను రికార్డుల్లోకి ఎక్కించేందుకు నానాతంటాలు పడ్డారు. వివరాలు అడిగిన ‘న్యూస్‌లైన్’కు అరకొర సమాచారమిచ్చారు. ఇందులో అనేక అక్రమాలు వెలుగుచూశాయి.. 2011-12లో సుమారు రూ.1.10 కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, డ్రైనేజీలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అప్పటి డీపీఓ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. టెండర్ ద్వారా చేపట్టాల్సిన పనులను నామినేషన్ పద్ధతిలో తమకు అనుకూలమైన వ్యక్తులకు అధికారులు కట్టబెట్టారని నివేదికలో పేర్కొన్నారు.
అలాగే 2010-11 సంబంధించిన ఆడిటింగ్ నేటికి పూర్తికాలేదని బిల్లులు చెల్లించలేమని ట్రెజరీ అధికారులు సైతం అభ్యంతరం తెలిపారు. దీంతో మాజీమంత్రి జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డిలు కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి వాటి బిల్లులను చేయించారు. అయితే 2010-11 ఆడిటింగ్ ఇప్పటికీ పూర్తికాకపోవడం శోచనీయం. ప్రస్తుతం కూడా టెండర్పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడంతో నాణ్యత లేకుండా చేపట్టారు. గ్రామ పంచాయతీలో రూ.2.50 కోట్ల ఆదాయం ఉన్నా బాధ్యత కలిగిన అధికారి లేకపోవడంతో సర్పంచ్, కార్యదర్శి, అధికారుల కనుసన్నల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ అవినీతి, అక్రమాలకు అడ్డుకట్టవేస్తారో లేదో వేచిచూడాలి..
వెలుగుచూసిన అక్రమాలు
పెబ్బేరు పంచాయతీ కార్యాలయానికి సంబంధించి హైమాస్ట్ లైట్లు, ఇతర పరికరాల కొనుగోలు పేరుతో కేవలం నాలుగు నెలల్లో నిబంధనలకు విరుద్ధంగా స్ఫూర్తి ఇంజనీరింగ్ వర్క్స్, మహబూబ్‌నగర్ వారికి రూ.18.49 లక్షలు చెల్లించారు.
పెబ్బేరు పట్టణంలో శానిటేషన్ పేరుతో నాలుగు నెలల్లో రూ.9.48 లక్షలు ఖర్చుచేసినట్లు చూపారు. ఫిల్టర్‌బెడ్ నిర్వహణ, సామగ్రి, సిబ్బంది వేతనాల పేరుతో నాలుగు నెలల్లో రూ.3.65 లక్షలు ఖర్చుచేసినట్లు చూపారు. పంచాయతీ కార్యాలయ నిర్వహణ పేరుతో రూ.1.94లక్షలు ఖర్చుచేసినట్లు తేలింది.
అలాగే పట్టణంలో పనిచేస్తున్న తాగునీటిని స రఫరా చేసే విద్యుత్ మోటార్ల మరమ్మతు, వైం డింగ్ పేరుతో మెకానిక్కు నాలుగు నెలల్లో రూ.2.48 లక్షలు చెల్లించినట్లు చూపారు. పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేశామని వాటర్ ట్యాంకర్ల కోసం నాలుగు నెలల్లో రూ.2.89 లక్షలు చెల్లించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఓ, డీఎల్పీఓ కార్యాలయాలకు ఇన్వెర్టలను కొనుగోలు చేసినట్లు రూ.42,300 ఖర్చు చూపించారు. కేవలం రెండు నెలల్లోనే సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పేరుతో రూ.1.20 కోట్లు ఖర్చుచేయడం విశేషం.
అంతేకాకుండా నెలరోజుల క్రితం ఖర్చు చేసినట్లు చూపుతున్న రూ.1.83 లక్షలు (చెక్ నెంబర్ 010281),రూ.1.83లక్షలు(చెక్నెంబర్ 010282), రూ.1.94 లక్షలు (010287)ఎందుకు ఖర్చుచేశారో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి పెబ్బేరు పంచాయతీలో అవినీతి అక్రమాలు ఏ మేరకు చోటుచేసుకున్నాయో స్పష్టమవుతోంది