అద్దె భవనాలే ముద్దు!
పాలకొండ.. ఒకప్పుడు మేజర్ పంచాయతీ. ప్రస్తుతం నగర పంచాయతీగా ఎదిగింది. అయితే పట్టణ ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో కూడా చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.
స్థాయి మారినా మౌలిక సదుపాయాల కల్పనలో తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నగర పంచాయతీకి ఉండాల్సిన ఏ హంగూ ఇక్కడ లేవు. నగర పంచాయతీ పరిధిలోని నాగవంశపువీధి వెనుక భాగంలో గతంలో పీతలబంద ఎకరా 26 సెంట్లు ఉండగా, ఈ ప్రాంతంలో కమ్యూనిటీ భవనానికి ఏర్పాట్లు చేస్తామని, ప్రతిపాదనలు పంపిస్తామని నేతలు, అధికారులు డబ్బా కొట్టారు. అయితే ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఆక్రమణదారులు ఈ ప్రాంతంపై దృష్టిసారించారు.
ఇంకెముంది ఎకరా స్థలం సెంట్లకు మారిపోయింది. ఇదే ప్రాంతంలో ఆర్యవైశ్య సంఘానికి 13 సెంట్లను కేటాయించారు. ఈ ప్రాంతంలో కల్యాణ మండపం, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మిస్తామని అప్పట్లో మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ చొంగ రమాదేవి పరిపాలనా కాలంలో సంకల్పించినా కార్యరూపం దాల్చలేదు.
వెంటాడుతున్న నిధుల లేమి!
ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ప్రభుత్వ, ఎంపీ నిధులతో నిర్మించిన సామాజిక భవనాల నిర్వాహణకు నిధుల కొరత గుదిబండగా మారింది. నిర్మాణం తర్వాత వాటి జోలికి అధికారులు వెళ్లకపోవడంతో శిథిలమవుతున్నాయి. నిధుల లేమే కారణమని అధికారులు చెబుతున్నారు. మహిళా ప్రాంగణాలుగా ఎస్‌జేఆర్‌వై పథకం కింద రత్తకన్న, బెల్లుపడ, ఉప్పలవీధిలో కమ్యూనిటి భవనాలను సుమారు రూ.17 .7 లక్షలతో నిర్మించారు.
వాటిలో రత్తకన్న, బెల్లుపడ భవనాలను ఎస్‌హెచ్‌జీలకు అందజేశారు. ఉప్పల వీధి మండపాన్ని అధికారికంగా అందజేయాల్సి ఉంది. కాగా ఎంపీ నిధులతో నిర్మించిన భవనాల నిర్వాహణపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కనీసం సన్నం వేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని సామాజిక భవనాలు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలుగా మారిపోయాయి. నిరుపయోగంగా ఉన్న సామాజిక భవనాలపై స్థానికులు దుస్తులు ఆరేసుకుంటున్నారు.