ప్రపంచంలో ఏది అతిపెద్ద మతమో తెలుసా?
వాషింగ్టన్: ప్రపంచంలో జనాభా పరంగా ఏ మతం అమిత వేగంగా పెరుగుతోందో, ఏ మతం వెనకబడి పోతుందో తెలుసుకునేందుకు అమెరికాలోని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ ఓ అధ్యయనం జరిపింది. ఊహించినట్లుగా అన్ని మతాలకన్నా ముస్లిం మతం సంఖ్యా పరంగా ముందుకు దూసుకెళుతోంది. 2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 31.4 శాతంతో క్రైస్తవులు అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా 2050 నాటికి జనాభాలో అంతేశాతంతో అది ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా తన స్థానాన్ని నిలుపుకోనుంది. కానీ 2070 నాటికి క్రైస్తవుల మతాన్ని అతిక్రమించి ముస్లిం మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఆవిర్భవించనుంది.
2010 లెక్కల ప్రకారం ముస్లింలు ప్రపంచంలో 23.2 శాతంతో రెండవ అతిపెద్ద మతంగా ఆవిర్భవించగా, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 29.7 శాతంతో సంఖ్యాపరంగా ముందుకు దూసుకుపోనుంది. అయినప్పటికీ దాని రెండో స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. 2070 నాటికి మాత్రం ప్రపంచంలో ముస్లింలదే అతిపెద్ద మతం అవుతుంది. నాస్తికులు, ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య కూడా 2010 లెక్కల ప్రకారం ఎక్కువే ఉంది. ప్రపంచ జనాభాలో 16.4 శాతంతో వీరి సంఖ్య మూడో స్థానంలో ఉండగా, 2050 నాటికి 13.2 శాతానికి తగ్గినప్పటికీ అదే మూడో స్థానాన్ని నిలుపుకోనుంది. వీరి సంఖ్య ఫ్రాన్స్, అమెరికా లాంటి సెక్యులర్ దేశాల్లో పెరుగుతుండగా, రిలీజియన్ దేశాల్లో గణనీయంగాతగ్గుతోంది.
2010 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 15 శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉండగా, 2050 నాటికి 14.9 శాతానికి తగ్గి అదే నాలుగో స్థానాన్ని నిలుపుకోనుంది.2010 లెక్కల ప్రకారమే బౌద్ధులు 7.1 శాతంతో ఐదో స్థానంలో ఉండగా, 2050 నాటికి సంఖ్యాపరంగా కూడా తగ్గి జనాభాలో 5.2 శాతానికి పడిపోనుంది. అయినప్పటికీ అది ఐదో స్థానంలోనే కొనసాగనుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న వివిధ మతాల తెగలు, చిన్న మతాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతూ 2050 నాటికి జనాభాలో శాతం పరంగా తగ్గనున్నాయి. ప్రపంచ జనాభాలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న యూదులు 2050 నాటికి సంఖ్యాపరంగా కాస్త పెరిగినప్పటికీ ప్రపంచంలో 0.2 శాతంతోనే వారు కొనసాగనున్నారు.
సెక్యులర్ దేశాల్లో తరగుతున్న యువ జనాభా, వర్ధమాన దేశాల్లో పెరుగుతున్న సంతానోత్పత్తి, తగ్గుతున్న శిశు మరణాలు, ఆయా దేశాల్లోని భౌగోళిక పరిస్థితులు, ఏ మతంలో సంతానోత్పత్తి శాతం ఎలా ఉందన్న అంశాలనే కాకుండా, ఏ మతం నుంచి ఏ మతానికి మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి, వారి సంఖ్య ఎంత అన్న అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రధాన మతాల పెరుగుదలను నిపుణులను అంచనా వేశారు. మత మార్పిడి అంశంలో అప్పటి పరిణామాలను అనుసరించి అంచనాలు కాస్త అటు, ఇటయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు తెలిపారు. ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య సబ్ సహారా ఆఫ్రికాలో పెరుగుతుండగా, ఉత్తర అమెరికా, ఫ్రాన్స్, యూరప్, చైనా, జపాన్ దేశాల్లో నాస్తికులు లేదా మత విశ్వాసంలేని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధుల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం మరో ఆశ్చర్యకర పరణామం.