చూపు మళ్లించి.. నోట్లు కొట్టేసి
అంతా చూస్తుండగానే చోరీ.. రూ.1.8 లక్షలు మాయం
జహీరాబాద్ టౌన్ : అంతా చూస్తుండగానే బ్యాంక్ నుంచి డ్రా చేసుకొస్తున్న డబ్బులను కొట్టుకెళ్లిపోయాడో వ్యక్తి. గురువారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
పట్టణంలోని మూసనగర్కు చెందిన మక్సూద్‌అలీ(55) స్థానిక మహీంద్ర కర్మాగారంలో కాంట్రాక్టర్. కాంట్రాక్టుకు సంబంధించిన రూ.1.80 లక్షల చెక్కును పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో డ్రా చేశాడు. డబ్బులను చేతి రుమాలలో చుట్టుకుని బ్యాంక్ బయట పార్కింగ్ చేసిన టీవీఎస్ మోపెడ్ కవర్లో పెట్టాడు. అంతలో నేలపై పడి ఉన్న పది రుపాయల మూడు కట్టలు మీవా! అంటూ వెనుకాల నుంచి ఓ వ్యక్తి అడగడంతో మక్సూద్‌అలీ వాటిని చూశాడు. తనవి కావని, ఎవరైన వస్తే ఇవ్వాలంటూ పక్కనే ఉన్న టీ కొట్టు నిర్వహకుడుకి చెబుతుండగా... అంతలో సదరు వ్యక్తి మోపెడ్‌లో దాచిన డబ్బులను తీసుకుని పరారయ్యాడు. కళ్లముందు జరిగిన ఈ ఘటనతో అంతా విస్తుపోయారు.
వెంటనే తేరుకున్నా...
వెంటనే తేరుకున్న మక్సూద్‌అలీ జహీరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఎస్ఐలు శివలింగం, సుభాష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతం జరిగిన తీరు తెలుసుకున్నారు. బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అలాగే పక్కనే మరో దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించారు. కానీ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.