కొనేవారేరీ!
వర్షాలతో మక్క రైతుకు కష్టం
మార్కెట్లో మొలకెత్తిన మక్కలు
ముఖం చాటేస్తున్న వ్యాపారులు
నర్సంపేట : నాలుగు రోజులుగా కురిసిన వర్షాలు మక్క రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు చేతికందే సమయంలో వర్షాలు కురవగా తడిసి ముద్దయి మక్కలు మొలకెత్తాయి. అయితే తడిసిన మక్కలను కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ వ్యవసాయ మార్కెట్ల వద్ద వేలాది క్వింటాళ్లు విక్రయించేందుకు వచ్చిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.7 నుంచి రూ,15 వేల వరకు పెట్టుబడులు అప్పులు చేసి పెట్టారు. కానీ గత నెలలో ఎండల తీవ్రత వల్ల 50శాతం ఎండిపోగా, నల్లరేగడి భూముల్లో మిగిలిన 30శాతం దిగుబడి రాలేదని రైతులు వాపోయారు. మిగిలిన పంట మక్కలను మార్కెట్లో విక్రయించేందుకు తీసుకురాగా ఎడతెరిపిలేని వర్షాలకు వరదలో వేలాది క్వింటాళ్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మక్కల ను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముఖం చాటేస్తున్నారని రైతులు చెబుతున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దీంతో పెద్ద మొత్తంలో మక్కలు మార్కెట్లోనే మొలకెత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
పత్తికి పొంచి ఉన్న ముప్పు
జిల్లాలో వరి పంట తర్వాత పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి చేలలో నీరునిలిచి జాలువారింది. వర్షాల వల్ల పూతదశలో ఉన్న పత్తి పంటలో 50శాతం వరకు పూత, పిందెలు రాలి రైతులకు నష్టాలను కలిగించింది. ఖరీఫ్ ప్రారంభం నుంచి అనుకూలంగా ఉన్న కాలం ఒక్కసారిగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు రావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని దయనీయ స్థితి నెలకొంది. చెరువులు, కుంటలు తెగినచోట, అలుగుపడిన చోట వరిపంటలో ఇసుకమేటలు వేసి నష్టాన్ని కలిగించింది. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో 8వేల 500 ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా 5వేల ఎకరాల్లో తుపాన్ ప్రభావంతో పంట నష్టపోయింది. అధికారులు 1600 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలు ఇచ్చారు. నష్టపోయిన ప్రతీరైతుకు పరిహారం అందించడంతో పాటు రబీలో వేరుశనగ, మక్కజొన్న విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని పత్తిరైతులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్కు వచ్చి వారమైంది
– నాంపెల్లి లక్ష్మి, పాతముగ్దుంపురం, నర్సంపేట
ఎకరం భూమిలో మక్కజొ న్న పంట సాగు చేసిన. పం టలు చేతికి వచ్చినయి. అ మ్ముకోవడానికి మార్కెట్కు నేను, మా ఆయన వారం రో జుల కిందట తీసుకువచ్చి నం. మ్యాచర్ రాలేదంటే రోడ్డుపైనే ఆరబోసుకున్నం. వర్షాలు వచ్చి మక్కజొన్నలు మొత్తం తడిసిపోయినయి. అధికారులు మమ్మల్ని ఆదుకోవాలి.
ఎనిమిది రోజులుగా ఇబ్బంది
– భూక్య రాంసింగ్, ఈర్యతండా, చెన్నారావుపేట
మార్కెట్కు 8 రోజుల కిందట అమ్ముకోవడానికి వచ్చాం. మ్యాచర్ తక్కువగా ఉందంటే ఆరబోసుకున్నాం. నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఎకరంలో పండిన మక్కలు తడిసిపోయాయి. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.