రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మాక్లూర్, న్యూస్లైన్: మాక్లూర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన గుండారం పోశెట్టి అనే రైతు కుటుంబం బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగేందుకు యత్నించింది. బాధితు ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గుండారం పోశెట్టి, గుండా రం పోసాని, గుండారం రాజుబాయిల కు ప్రభుత్వం 50 ఏళ్ల క్రితం గ్రామ శివారులోని సర్వే నంబర్ 70, 70/1, 70/2లో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. అప్పటి నుంచి వారు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం పక్కవారితో వివాదం రావడంతో పోశెట్టి వీఆర్ఓ భోజారావును ఆశ్రయించాడు. ఆయన హద్దులు చూపిస్తానని చెప్పి పోశెట్టి నుంచి రూ. 10 వేలు తీసుకున్నారు. రూ. 700 చలా నా కట్టించి తాత్కాలిక పహాణీ జారీ చేయించారు. అనంతరం వీఆర్ఓ ఎవ్వరికీ తెలియకుండా అదే భూమిలో 1.04 ఎకరాల భూమిని వల్లభాపూర్ గ్రామానికి చెందిన గొల్ల అబ్బులుకు అక్రమం గా పట్టా చేసి ఇచ్చారు.
అప్పటి నుంచి పోశెట్టి భూమిని సాగు చేయకుండా అబ్బులు అడ్డుకుంటున్నాడు. తిరిగి సర్వే హద్దులు చూపించాలని ఆరేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు నెలల నుంచి కొందరు రెవెన్యూ సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నా రు. దీంతో ఆవేదన చెందిన పోశెట్టి ఆయన భార్య రజని, పిల్లలు పవన్, జ్యోతి, బంధువులు బుధవారం పురుగుల మందు డబ్బా తీసుకుని తహశీల్ కార్యాలయానికి వచ్చారు. తహశీల్దార్ నారాయణ చాంబర్లోకి వెళ్లి తమ భూమి తమకు ఇవ్వాలని వేడుకున్నారు.
లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. ఆయన అందించిన సమాచారం తో ఎస్ఐ సంతోష్కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని పోశెట్టిని వారించి పురుగుల మందు డబ్బాను లాక్కున్నా రు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు హైడ్రామా కొనసాగిం ది. న్యాయం చేస్తామని ఎస్ఐ, తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతు కుటుం బం శాంతించింది.