యువకుడి ఆత్మహత్య
కళ్యాణదుర్గం: ఆస్తి పంపకాల్లో తనకు న్యాయం జరగలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణదుర్గంలోని బ్రహ్మంగారిగుడి చింతతోపులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్ఐ శంకర్రెడ్డి తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. శెట్టూరు మండలం మాకోడికి గ్రామానికి చెందిన యల్లప్పకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు వేణుగోపాల్ (24) క్రేన్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురానికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది. మారెంపల్లిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.
ఆస్తి పంపకాలలో తనకు న్యాయం జరగలేదని వేణుగోపాల్ భార్యతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంలో భార్య జ్యోతి మాకోడికిలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారు వెంటనే ఆచూకీ కోసం అన్వేషించారు. బ్రహ్మంగారి గుడి చింతతోపులో చెట్టుకు వేణుగోపాల్ ఉరివేసుకున్నట్లు శనివారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.