ఆపరేషన్ చైనా
హిందూ మహాసముద్రం మీద చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి డ్రోన్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డ భారత్.. పూర్తిగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో నేవీ బలగాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ : హిందూ మహాసముద్రంపై నౌకా వాణిజ్యానికి చాలా కీలకం. భారత్-చైనాలు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యంకోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. తాజాగా భారత్.. ఇండియన్ ఓషియన్ రీజియన్లో తన నేవీ బలగాలను మరింత శక్తివంతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి మలాకా జలసంధి వరకూ.. 24 గంటలు పహారా కాసేలా.. యుద్ధనౌకలను ఏర్పాటు చేస్తోంది. సముద్ర జలాల నుంచి ఉగ్రవాదులు ఎక్కడైనా.. ఎప్పుడైనా విరుచుకుపడొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతోనే నేవీని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
24 X 7.. పహారా
హిందూ మహాసముద్రంలో ప్రతిక్షణం కాపు కాసేందుకు 12 నుంచి 15 డెస్ట్రాయర్లు, భారీ, చిన్నపాటి యుద్ధనౌకలు, గస్తీ నౌకలను ఏర్పటు చేశారు. అంతేకాక నావల్ శాటిలైట్ అయిన జీశాట్-7తో అంతరిక్షణం నుంచి ప్రతిక్షణం పరిశీలన చేయనున్నారు. మిషన్ రెడీ వార్షిప్స్ పేరుతో ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రాన్ని దాదాపు తన అదుపులోకి తీసుకున్నట్లేనని సీనియర్ నేవీ అధికారులు చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఏడెన్, మలాకా జలసంధి వరకూ.. 24 గంటలే ఇండియన్ నేవీ గస్తీ కాస్తుందని.. ఏ చిన్న సహాయం, ఇతర అవసరాలు ఏర్పడ్డా నేవీ అధికారులు వేగంగా స్పందిస్తారని అధికారులు చెబుతున్నారు.
అన్ని వైపులా..!
శివాలిక్ తరగతికి చెందిన యుద్ధవిమానం బంగాళాఖాతంలో.. బంగ్లాదేశ్, మయన్మార్లవైపు గస్తీ కాస్తోంది. అలాగే టెగ్ తరగతికి చెందిన మరో యుద్ధ విమానం మడగాస్కర్, మారిషస్ చుట్టూ పహారా కాస్తోంది. ఐఎన్ఎస్ త్రిషూల్.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, కోరో యుద్ధ నౌక అండమాన్ సముద్రంలో గస్తీ కాస్తున్నాయి.
చైనాకు అడ్డుకట్ట
చైనా యుద్ధ నౌకలు, సభమెరైన్స్ కొన్నేళ్లనుంచీ తరుచుగా హిందూమహాసముద్ర జలాల్లోకి వచ్చి వెళుతున్నాయి. ఈ మధ్యే న్యూక్లియర్ సబ్మెరైన్స్ సైతం ఈ జలాల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత నేవీ దళాలు.. పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్రంపై గస్తీ తిరుగుతంటే.. చైనా నౌకలు ఇటు వచ్చే అవకాశం ఉండదు.
మరింత బలొపేతం!
ప్రస్తుతం ఇండియన్ నేవీ వద్ద 138 యుద్ధనౌకలు, 235 ఎయిర్క్రాఫ్ట్ , హెలీకాప్టర్లు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్యను భారీగా పెంచేందుకు నేవీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యుద్ధ నౌకలను 212కు, హెలీకాప్టర్లను 458 పెంచుకోవాలని.. నేవీ అధికారులు భావిస్తున్నారు.