Maladharana
-
అయ్యప్ప మాలధారణ .. నియమాల ఆచరణ.. మండల పూజ ఎప్పటినుంచంటే?
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప): శివకేశవుల తనయుడైన శ్రీమణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ. హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వేలమంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్షమార్గాన్ని అన్వేశించే వారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పని సరిగా జీవితంలో ఒక సారి అయినా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు. నియమాలు ఇలా.. అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో మాతృమూర్తి వద్ద వేయించుకోవచ్చును. ప్రతి రోజు సూర్యోదయంకు ముందే పూజలు, సూర్యాస్తమయం తరువాత పూజలు నిర్వహించాలి. కఠిన నియమాలను పాటిస్తూ నలుపు దుస్తులనే వాడాలి. రాత్రివేళల్లో ఆలయాలలోని నిద్రే శ్రేయస్కరం. ప్రతి రోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి. భక్తుడే భగవంతుడు అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌక్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై స్వామి గానే పిలువబడుతుంటారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికి, భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. ఇరుముడి ప్రాముఖ్యత అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్క్ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నెయ్యితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకరజ్యోతిగా భావించాలి. ఆద్యంతం భక్తిపారవశ్యమే.. శబరిమలై యాత్ర ఆధ్యంతం భక్తి పారవశ్యమే. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుళ్లి ఆడి వావర్స్వామిని, పేటశాస్త్రిలను దర్శించుకుని పంబకు బయలుదేరుతారు. పంబానదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచిమేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. పంబానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తిఆల్కు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామి వారిని సన్నిధానానికి చేరుకుంటారు. పవిత్రమైన పదునెట్టాంబడి.. స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి ఎక్కవలెను. స్వామి వారి దర్శనార్థం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకాన్ని చేస్తారు. అనంతరం మాలిగైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలను దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుగా చెల్లించుకుంటారు. అద్వైత మలై.. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించినవాడే అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమలవెంకటేశ్వరస్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండల కాలం (41రోజులు) ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లను ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్లీ అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తులు. ఈ యేడాది నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేది వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. -
దీక్ష విరమణ ఘట్టం... భక్తి పారవశ్యం
-
మాలధారణం.. నియమాల తోరణం
కార్తీకమాసం పూజలకు పెట్టిందిపేరు. సూర్యోదయంలోగా స్నానాలు.. పూజలు.. ఉపవాసాలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. మాలధారణలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఈ మాసంలోనే వేలాది మంది భక్తులు జ్యోతిస్వరూపుడు.. హరిహరసుతుడు.. శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒకసారి భిక్ష.. మరోసారి అల్పాహారం.. రెండుసార్లు చన్నీటి సాన్నం.. నేలపై నిద్రించాలనే కఠిన నియమాలతోరణమే ఈ దీక్ష. ప్రాధాన్యత.. పాటించాల్సిన నియమాలపై ప్రత్యేక కథనం... - ఘట్కేసర్ టౌన్ దీక్ష చేపట్టే విధానం అయ్యప్పస్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాలధారణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి ఉండాలి. తల వెంట్రుకలు, గోళ్లు, ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగీ, కండువా, చొక్కా, తులసిమాల తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్లాలి. ఆరుసార్లు శబరి యాత్రకు బయలుదేరి మకరజ్యోతిని దర్శించుకున్న గురుస్వామితో మాల స్వీకరించాలి. స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా, శివుడిని విభూదిగా, విష్ణువును కుంకుమ రూపంగా భావించి నుదిటిపై దిద్దుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాదిపాటు మాల ధరించకూడదు. భార్య మరణిస్తే ఆరునెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి. దీక్ష స్వీకరించాక.. మాలధారులు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు. అలా వీలుకాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ఎత్తయిన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించాలి. మండల దీక్ష కోసం సంకల్పం తీసుకొని కలశస్థాపన చేయాలి. ఒకసారి కలశ స్థాపన జరిగాక దీక్ష ముగిసేవరకు కదిలించకూడదు. దేవతామూర్తుల చిత్రపటాలకు శిరుస్సు నుంచి పాదాల వరకు అలంకరణ చేయాలి. దీపారాధన చేసిన అనంతరం ముందుగా గణపతి స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామిని పూజించిన పిదప అయ్యప్ప పూజ నిర్వహించాలి. మొదటిసారి మాలధరించిన స్వామిని కన్నెస్వామి అని, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగో సారి గదస్వామి, ఐదోసారి పెరుస్వామి, ఆరు నుంచి 18వ సారి వరకు వివిధ పేర్లతో పిలుస్తారు. నియమాలు * మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి. * భిక్షాటన చేసిన బియ్యంతోనే స్వయంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో 41 రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు. * సూర్యుడు నెత్తిమీదికి వచ్చాక మధ్యాహ్నం మూడు గంటలలోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి. * కటిక నేలపై నిద్రిస్తూ ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి. * మలవిసర్జనకు వెళ్తే తిరిగి స్నానమాచరించి స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి. * మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి. * అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య, అనబడే పదునెట్టాంబడికి దూరంగా ఉండాలి. * తన శక్తికొలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. * శరణుఘోష ప్రియుడైన అయ్యప్ప పూజల్లో తరుచూ పాల్గొనాలి. * హింసాత్మక చర్యలు,దుర్భాషలాడడం,అబద్ధాలాడడం చేయరాదు. * దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులు మినహా దీక్షలోలేనివారికి పాదాభివందనం చేయకూడదు. * బ్రహ్మచర్యం పాటిస్తూ నుదిటిపై విభూది, కుంకుమ, చందనం విధిగా ఉండాలి. * నల్లని దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతూ ఎదుటి అయ్యప్పలను గౌరవించాలి. పదునెట్టాంబడి ప్రశస్త్తి.. పదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం. ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం, దర్పం, అహంకారం, వీక్షణాశక్తి, వినికిడి శక్తి, అగ్రాణశక్తి, రుచి చూసే శక్తి, స్పర్శశక్తి, సత్వగుణాలు, తమోగుణం, రజోగుణం, విద్య, అవిద్య. ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులు పవిత్ర గ్రంథాల్లో పొందుపరిచారు. ఆ మెట్లలో 18 రకాల శక్తులుండటం వల్ల 18 సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాల విరమణ శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. ఇంటివద్ద మాతృమూర్తితో మాల తీయిం చాలి. దానిని మరుసటి ఏడాది కోసం భద్రపర్చాలి. కొందరు తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్ని ధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాలతీస్తున్నారు.