'మలాలా స్కూల్ని పేల్చేస్తాం'
లండన్: బ్రిటన్ లోని ఎనిమిది పాఠశాలలను బాంబులతో పేల్చివేస్తామని ఉగ్రవాదులు సోమవారం బెదిరించారు. పాకిస్థానీ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయి చదువుతున్న స్కూల్ కూడా ఉగ్రవాద బెదిరింపులు వచ్చిన వాటిలో ఉంది. ఇంగ్లండ్ బిర్మింగ్ హామ్ లోని ఆరు స్కూళ్లు, స్కాట్లాండ్ గ్లాస్ గౌలోని రెండు పాఠశాలలను పేల్చివేస్తామని ఉగ్రవాదులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ పాఠశాలల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.
18 ఏళ్ల మాలాలా ప్రస్తుతం బిర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఈ పాఠశాలతో పాటు మరో ఏడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపులు ఉత్తవేనని తనిఖీల అనంతరం పోలీసులు తేల్చారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో విద్యార్థులు తిరిగి తరగతి గదుల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. గతకొన్నిరోజులుగా ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ బ్రిటన్ ను వణికిస్తున్నాయి. తాజా ఉగ్రవాద బెదిరింపులు కూడా ఉత్తివేనని పోలీసులు తేల్చారు.