సిగరెట్ కాల్చిన మలేసియా మంత్రికి రూ.95 వేల జరిమానా
కౌలాలంపూర్: కేంద్ర మంత్రి. అందులోనూ కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి. బహిరంగంగా సిగరెట్ తాగి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని నెటిజన్లు మంత్రి మొహమ్మద్ హసన్‌పై ఆన్లైన్లో విమర్శల వరద పారించారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన ఘోర నేరం ఏంటంటే బహిరంగంగా సిగరెట్ కాల్చడం. భారత్‌లోలాగే మలేసియాలోనూ బహిరంగంగా ధూమపానంపై నిషేధం అమల్లో ఉంది. బహిరంగంగా సిగరెట్ కాల్చే పొగరాయుళ్లపై జరిమానాల విధించడం, శిక్షించడం భారత్‌లో ఏ స్థాయిలో అమలవుతోందో భారతీయ పౌరులందరికీ బాగా తెలుసు. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో పార్లమెంట్ సభ్యులు ఒకరిద్దరు బహిరంగంగా సిగరెట్ గుప్పుగుప్పుమని కాల్చినా జరిమానా వేసిన పాపానపోలేదు. కానీ మలేసియా ప్రభుత్వం మాత్రం సదరు మంత్రికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అక్కడి చట్టాల ప్రకారం బహిరంగ ధూమపాన నేరానికి కనీసం 5,000 రింగెట్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.95,000 జరిమానా విధిస్తారు. తప్పుకు శిక్షగా జరిమానా కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి హసన్ చెప్పారు. హోటల్ వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో సిగరెట్ కాల్చడం నేరం. అందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన చెప్పారు. నెగేరీ సెంబిలాన్ రాష్ట్రంలోని ఒక హోటల్లో ఆరుబయట కూర్చొని స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సిగరెట్ కాల్చుతున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే తప్పును తెల్సుకున్న మంత్రి స్వయంగా ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రతించి తనకు జరిమానా విధించాలని కోరినట్లు తెలుస్తోంది. తానేం చట్టానికి అతీతుడిని కాదని, మంత్రి స్వయంగా జరిమానా విధించాలని వేడుకున్నారని ఆరోగ్య మంత్రి జుల్కెఫీ అహ్మద్ వెల్లడించారు. వంటశాలలు, రెస్టారెంట్లలో ధూమపానంపై నిషేధం 2019 ఏడాది నుంచి అమల్లో ఉంది. 2024 అక్టోబర్ నుంచి మరింత కఠినమైన నియమనిబంధనలను అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రిపైనే విమర్శలు రావడం గమనార్హం. సెరెంబన్ జిల్లా ఆరోగ్య కార్యాలయం నుంచి సదరు నోటీస్‌ను బుధవారం అందుకున్నానని మంత్రి అహ్మద్ వెల్లడించారు. ‘‘ఈ అంశం నిజంగా చర్చనీయాంశమై ఆందోళన కల్గించి ఉంటే సారీ చెప్పేందుకు నేను సిద్ధం. ఆరోగ్య శాఖ ఎంత జరిమానా విధించినా నేను కట్టేస్తా. నాపై మరీ పెద్దమొత్తాలను జరిమానాగా మోపబోరని భావిస్తున్నా’’అని బుధవారం ఒక పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు.