'మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే జరిమానా, బహిష్కరణ'
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల నిరంకుశత్వాన్ని గుర్తుకుతెచ్చేలా పాకిస్థాన్‌లోని వాయవ్య గిరిజన ప్రాంతంలో మత నాయకులు వ్యవహరిస్తున్నారు. మగ బంధువు తోడు లేకుండా ఇంటి నుంచి మహిళలు ఒంటిరిగా బయటకు వెళ్లరాదంటూ నిషేధం విధించారు.
నిబంధనను అతిక్రమించి ఎవరైనా బయటకు వెళ్తే జరిమానా విధించడంతో పాటు సంఘ బహిష్కరణ చేస్తామని మతనాయకులు హెచ్చరించారు. ఆడవారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే గతి పడుతుందని హుకుం జారీ చేశారు. కరక్ జిల్లాలోని కైబర్-పక్టుంఖ్వాలో శనివారం జరిగిన ఓ మత పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ టెక్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ ఏలుబడిలో ఈ ప్రాంతం ఉంది. మహిళలు పూర్తిగా దుస్తులు ధరించి బయటకు వెళ్లాలని తీర్మానించారు.