మాల్యా ఒప్పందం పరిశీలనలో డయాజియో
న్యూఢిల్లీ/లండన్: యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్ఎల్) చైర్మన్ హోదా నుంచి విజయ్ మాల్యాను తప్పించేందుకు కసరత్తు చేస్తున్న డయాజియో గతంలో ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తోంది. మాల్యా, ఆయనకు చెందిన యూబీ గ్రూప్ పట్ల నిర్వర్తించాల్సిన విధులను పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒప్పందం ప్రకారం యూఎస్ఎల్ చైర్మన్‌గా తనను కొనసాగించేందుకు డయాజియో మద్దతు పలికి తీరాల్సిందేనని మాల్యా చెబుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఎగవేతల్లాంటివేవీ లేకపోతేనే ఒప్పంద నిబంధనలు వర్తిస్తాయని యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటాలున్న డయాజియో తెలిపింది. ఈ నేపథ్యంలోనే డీల్ విధివిధానాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తదితర అనుబంధ సంస్థలకు అక్రమంగా నిధుల (రూ.1,337 కోట్లు) మళ్లించారన్న ఆరోపణల మీద యూఎస్ఎల్ చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి మాల్యాను తప్పించేందుకు డయాజియో చర్యలు ప్రారంభించింది.
యూబీ షేర్ల పతనం: యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్‌గా విజయ్ మాల్యా వైదొలగాలన్న డిమాండ్ నేపథ్యంలో యునెటైడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు చెందిన వివిధ షేర్లు సోమవారం పతనమయ్యాయి. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడం లేని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ షేర్ ధర కూడా తగ్గిపోయింది.