ఫారెస్ట్ సిబ్బంది, ఆదివాసీల మధ్య ఘర్షణ
- వెదురు కర్ర తరలిస్తున్న వారి నుంచి గొడ్డళ్లు లాక్కోవడంతో చెలరేగిన వివాదం
- రోడ్డు ఎందుకు వేయనీయడం లేదని అధికారులపై కొండాయి, మల్యాల గ్రామస్తుల ఆగ్రహం
ఏటూరునాగారం : ఫారెస్ట్ అధికారులు, ఆదివాసీలు ఘర్షణకు దిగిన సంఘటన మండలంలోని మండలంలోని మల్యాల, కొండాయి గ్రామంలో ఆదివారం జరిగింది. మల్యాల - ఊరట్టం రోడ్డు పనులు రిజర్వు ఫారెస్ట్‌లో జరుగుతున్నాయని తెలియడంతో ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు పనులు నిలిపి వేయించేం దుకు వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి యాకయ్య, కొండాయి సెక్షన్ అధికారిణి ఝాన్సీరాణి, బేస్‌క్యాంప్ వాచర్ హరీష్, డ్రైవర్ సతీష్ కలిసి అటవీశాఖ జీపులో వెళ్లారు. అక్కడ రోడ్డు పనులు పరిశీలించి కొండాయి మీదుగా తిరిగి ఏటూరునాగారం వస్తున్నారు.
మార్గమధ్యంలో ఇద్దరు గిరిజనులు ఎడ్లబండ్లపై వెదురు కర్రను అడవి నుంచి తీసుకొస్తూ కనిపించారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వారిని అడ్డగించి బండ్లపై ఉన్న సిద్దబోయిన రామ య్య, మరోవ్యక్తి వద్ద ఉన్న గొడ్డళ్లను లాక్కున్నారు. దీంతో వారు మల్యాలకు వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో గ్రామంలోని గిరిజనులంతా జీపులో వెళుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరి గింది. మల్యాల -ఊరట్టం రోడ్డు పనులు జరగకుండా మీరెందుకు అడ్డుపడుతున్నారని ఫారెస్ట్ అధికారులను ఈ సందర్భంగా వారు నిలదీశారు. గిరిజన గ్రామాలకు రవాణా మార్గం లేకుండా చేస్తారా అంటూ కొండాయి, మల్యాల గిరిజనులు రేంజర్ యాకయ్య, ఎస్ఎఫ్ఓ ఝాన్సీ, డ్రైవర్ సతీష్, వాచర్ హరీష్‌పై దాడికి దిగారు. రేంజర్‌ను కిందికి దింపడానికి ప్రయత్నం చేసి అతడి చొక్కా చింపారు. జీప్‌ను అడ్డగించి నాలుగు గంటలపాటు నిర్బంధించారు. చివరికి ఎలాగోలా ఫారెస్ట్ సిబ్బంది ఏటూరునాగారం చేరుకున్నారు.
మాపై అధికారులే ముందు దాడి చేసిండ్లు..
మహిళలపై జంగ్లతోల్లు కావాల్ననే దాడి చే సిండ్లు.. అడవిలో జీవిస్తున్న మాకు వీళ్లు స్వేచ్ఛ లేకుండా చేస్తుండ్లు. మమ్ములను ఎప్పుడూ ఏదో పేరుతో వేధిస్తుండ్రు. ఇంట్ల ఉన్న ఆడ, మగ అని తేడా లేకుండా ఇబ్బంది పెడుతూ కేసులు బనాయిస్తున్నరు. మేం అడవిలో బతికేందుకు సోటు లేదా.
-తాటి పార్వతి, మల్యాల
గొడ్డలి గుంజుకున్నరు
అడవిలో ఎండిపోయిన పుల్లలు, వెదురు కర్రలను పొలానికి చుట్టూ కట్టడానికి తెచ్చుకుంటంటే జీపులో సార్లు వచ్చి గొడ్డలి గుంజుకున్నరు. అడవిలో ఎలాంటి చెట్లను నరకలేదని చెప్పినా ఇనిపించుకోలే. అంతకముందు మూడురోజుల కిందట నన్ను కొట్టిండ్లు. అడవిలో ఎవుసాయం చేసి బతికొటల్లం. మమ్ముళ్లికొడితే ఎమత్తది. మాకు న్యాయం చేయాలే. -సిద్దబోయిన రామయ్య, మల్యాల