మమత ప్రాణాలకు ముప్పుంది!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పుందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్కతా విమానాశ్రయంలో దాదాపు అరగంట పాటు గాల్లోనే తిరిగిందని, ఆ సమయంలో విమానంలో ఇంధనం అయిపోతోందని చెప్పినా ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పార్లమెంటు ఉభయ సభల్లో టీఎంసీ సభ్యులు ప్రస్తావించారు. కోల్కతా విమానాశ్రయంలో జరిగినది ఏమాత్రం సరికాదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. (దీదీని హతమార్చేందుకు కుట్ర!)
దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లో్క్సభలో సమాధానం ఇచ్చారు. కోల్కతా విమానాశ్రయంలో అదే సమయానికి మొత్తం మూడు విమానాలు ల్యాండింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని, మూడు విమానాల పైలట్లు కూడా దిగేందుకు అనుమతి కోరారని.. అయితే వాళ్లలో ఏ ఒక్కరూ ప్రయారిటీ ల్యాండింగ్ కావాలని మాత్రం అడగలేదని ఆయన చెప్పారు. కాగా, అసలు విమానాలు టేకాఫ్ తీసుకోడానికి ముందు అందులో తగినంత ఇంధనం ఉందా లేదా అనే విషయంపై డీజీసీఏ విచారణకు ఆదేశించిందని ఆయన అన్నారు. 30-40 నిమిషాల పాటు విమానం గాల్లో ఉందనడం మాత్రం సరికాదని... ఏడు నిమిషాల పాటు మాత్రమే అది ఆగిందని చెప్పారు. మమతా బెనర్జీతో పాటు అందులో ఉన్న అందరు ప్రయాణికుల ప్రాణాలు కూడా తమకు ముఖ్యమేనని మరో మంత్రి అనంతకుమార్ తెలిపారు.
ఈ అంశంపై రాజ్యసభలో మాయావతి, శరద్ యాదవ్ తదితర సభ్యులు ప్రస్తావించి, ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీలు ప్రయాణిస్తున్న విమానాలకు ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. సాధారణంగా విమానాల్లో ఇంధనం అయిపోవడం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యం పాలైనా శత్రుదేశాలు కూడా దిగేందుకు అనుమతి ఇస్తాయని.. అలాంటప్పుడు మన సొంత విమానాశ్రయాల్లో మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వరని మరికొందరు అన్నారు. అవి ప్రైవేటు విమానాలైనా, సర్వీసు విమానాలైనా వెంటనే దిగేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు.