హలో..నేను సీఎంను..
మమతానగర్ వాసులకు కేసీఆర్ ఫోన్
ఆదివారం కాలనీలో పర్యటిస్తానని కాలనీ అధ్యక్షుడికి సమాచారం
పనులెలా జరుగుతున్నాయని ఆరా
నాగోలు: స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం.. కాలనీలో సాధకబాదకాలపై ఆరాతీయడంతో నాగోలు పరిధిలోని మమతానగర్ కాలనీ వాసులు ఉబ్బితబ్బిబవుతున్నారు. గత ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కాలనీలో పర్యటించి అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. అలాగే సీఎం తాను వచ్చే ఆదివారం మళ్లీ వస్తానని, పరిస్థితి మారిపోవాలని హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మమతానగర్‌కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేశారు. కాలనీల్లో ఏ మేరకు పనులు జరుగుతున్నాయి.. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా... పారిశుధ్య పనులు చేపడుతున్నారా... డంపర్బిన్లు ఏర్పాటు చేశారా అంటూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాను వస్తానని, కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చెప్పినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
వెంకటరమణ కాలనీ అధ్యక్షునికీ ఫోన్...
మమతానగర్‌కాలనీ సమీపంలో ఉన్న వెంకటరమణ కాలనీ అధ్యక్షులు షౌకత్ హుస్సేన్‌కు కూడా సీఎం ఫోన్ చేసి కాలనీలోని సమస్యలపై ఆరా తీశారు. ఆదివారం సాయంత్రం కాలనీకి వస్తున్నానని పేర్కొన్నారు.
శానిటేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్....
జీహెచ్ఎంసీ శానిటేషన్ అదనపు కమిషనర్ రవికిరణ్, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంహెచ్ఓ ఎజాజ్ఖాసీంలు బుధవారం మమతానగర్ కాలనీలో పర్యటించారు. అన్ని కాలనీల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. మరో పక్క ఎల్బీనగర్ ఏసీపీ సీతారాం, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ సుదర్శన్‌లు మమతానగర్, వెంకటరమణకాలనీల్లో పర్యటించారు.