ఎస్బీఐలో భారీ స్కాం : కష్ణచైతన్య అరెస్ట్
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గాయత్రీనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను బ్యాంకులో పనిచేసే సిబ్బందే మాయం చేసినట్టు వెల్లడైంది. మొత్తం 10.2 కిలోల బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్ నుంచి మాయమైనట్టు గుర్తించారు. బ్యాంకు హెడ్‌క్లర్క్ కృష్ణ చైతన్య.. బ్యాంకు సిబ్బంది దిలీప్, ఫణికుమార్ సహాయంతో లాకర్ నుంచి బంగారు నగలను తీసి నగరంలోని మాచవరంలో ఉన్న మణప్పురంలో తనఖా పెట్టి రూ.3 కోట్లు రుణం తీసుకున్నట్టు సీఐడీ విచారణలో తేలింది.
కృష్ణచైతన్య ఆ నగదును షేర్ మార్కెట్లో పెట్టినట్లు సమాచారం. పలువురు ఖాతాదారులు తమ గోల్డ్ లోన్లు చెల్లించి ఆభరణాలు తిరిగి ఇవ్వమని బ్యాంకు హెడ్ క్లర్క్‌ను అడగగా ఆయన ఆభరణాల కోసం రేపు రమ్మని.. తర్వాత రమ్మని తిప్పుతున్నారు. దీంతో అనుమానమొచ్చిన ఖాతాదారులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు అధికారులు సీఐడీ విభాగానికి ఫిర్యాదు చేశారు. సీఐడీ ఎస్పీ కాళిదాసు వెంకట రంగారావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ నిర్వహించారు. బ్యాంకు సిబ్బందే సూత్రధారులని తేలడంతో కృష్ణచైతన్య, దిలీప్, ఫణికుమార్‌లను అరెస్టు చేశారు.