ఆటా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
సాక్షి, అలంపూర్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం చిన్నఆముదాలపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. స్థానిక పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, డ్యూయల్ డెస్క్, వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రంతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం, కలెక్టర్ రజత్ కుమార్ సైని, తదితర సభ్యులతో కలిసి గురువారం ప్రారంభించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులు, డాక్టర్ జ్యోతి నందన్ రెడ్డి(హైదరాబాద్), రాజేశ్ నందన్ రెడ్డి కరకాల (అమెరికా), నరేందర్ రెడ్డి నూకల (అమెరికా), సుహీల్ చందా (అమెరికా), కిశోర్ రెడ్డి జి (అమెరికా)లు విరాళం ఇవ్వడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి.
వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రాలకు రూ.3 లక్షలు, ప్రాథమిక తరగతి గదులలో 25 డ్యూయల్ బెంచిలకు రూ.లక్ష, డిజిటల్ తరగతి గదులకు రూ.లక్ష, ఆరోగ్య ఉపకేంద్రానికి లక్ష రూపాయల చొప్పున ఆ దాతలు విరాళం అందించి తమ వంతు సేవ చేశారు. చిన్నఆముదాలపాడు గ్రామసర్పంచ్ కవిత, ఆటా కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ ఆల రామకృష్ణారెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, నేతలు పాఠశాలను సందర్శించారు. లక్షల్లో నిధులు అందించి పలు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఆటాకు నేతలు ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక నేతలతో పాటు ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, ఉపాధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి, బోర్డు ట్రస్ట్ సభ్యులు అనిల్ బొడిరెడ్డి, పి.వేణు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీదర్ రెడ్డి, అంతర్జాతీయ సమన్వయకర్త కాశీ, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్మన్ ఆల రామకృష్ణారెడ్డి, తదితరులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.