ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 9లోపు దరఖాస్తులు
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం నవంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆదేశించారు. విద్యార్థుల వివరాలను www.epass.cgg.gov.in వెబ్సైట్లో లాగినై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నింపాలన్నారు. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించి తమ దరఖాస్తులను ఆన్లైన్లో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, ధ్రువీకరణ పత్రాలను జతపరిచి దరఖాస్తులను మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందజేయాలన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 10వ తేదీ నాటికి సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని విజయభాస్కర్ కోరారు.
ఇవీ.. జాగ్రత్తలు
- ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి అన్ని మండల విద్యావనరుల కేంద్రాల్లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు ఇవ్వాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు
- విద్యార్థులు ముందుగా తమ పేరు లేదా తల్లిదండ్రులు లేదా ఉమ్మడిగా బ్యాంకు ఖాతా తెరిచే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి
- విద్యార్థులు సంబంధిత మండలంలో మీ సేవా ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, రూ.2 లక్షలకు లోబడి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందే విధంగా హెడ్మాష్టర్లు చర్యలు తీసుకోవాలి
- ఈ వివరాలతో పాటు పాఠశాల వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నింపి దరఖాస్తు ప్రింట్ కాపీ, బ్యాంకు కాపీ మొదటి పేజీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, విద్యార్థి ఫొటో జతచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందజేయాలి
- ఈ పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ ప్రధానోపాధ్యాయులు సంబంధిత హాస్టల్ వార్డెన్‌కు అందజేయాలి
- ప్రధానోపాధ్యాయులు సదరు విద్యార్థి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే మరే ఇతర స్కాలర్షిప్ పొందడం లేదని ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి
- అర్హత కలిగిన ఏ విద్యార్థీ ఉపకార వేతనం పొందలేకపోతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయలు తమ పాఠశాలల్లో చదివే షెడ్యూల్డ్ కూలాల విద్యార్థులతో ఉపకార వేతన దరఖాస్తులను ఆన్లైన్ చేయించే బాధ్యతను తీసుకోవాలని డీఈవో విజయభాస్కర్ ఆదేశించారు.