మిగిలేది ముగ్గురే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల ఫీవర్ యంత్రాంగానికి తాకింది. మూడేళ్లు పైబడి జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పాలనా యంత్రాంగంలో కలవరం మొదలైంది. ఇప్పటివరకు ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులకే బదిలీలను పరిమితం చేసిన ఈసీ.. ఈ సారి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీఓ), సబ్ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీల జాబితాలో చేర్చడంతో అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వచ్చే నెల పదో తేదీ నాటికీ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. మే 31, 2014 నాటికి మూడేళ్లు పూర్తయ్యే అధికారులకు స్థానభ్రంశం కలిగించాలని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మండలాలకుగాను 30 మండలాల ఎంపీడీఓలపై బదిలీల ప్రభావం పడనుంది..
గండేడ్, రాజేంద్రనగర్, హయత్‌నగర్ మినహా మిగతా మండలాల అభివృద్ధి అధికారులకు స్థానచలనం కలగనుంది. ఊహించని ఈసీ ఆదేశాలతో నివ్వెరపోయిన ఎంపీడీఓల సంఘం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలతో తమకు ప్రత్యక్ష సంబంధంలేనందున తమను బదిలీల నుంచి మినహాయించాలని అభ్యర్థించాలని సంకల్పించారు. మరోవైపు మూడేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్ల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది.