మరో ఆరు నెలలు ‘ప్రత్యేక’మే
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు(జీఓఎంఎస్ 11) జారీ చేసింది. దీంతో మరో ఆరు మాసాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు స్థానిక ఎన్నికల నిర్వహణ కు అవరోధంగా మారినట్టు తెలుస్తోంది.
గత రెండున్నరేళ్లుగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేవు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ప్రజలతోపాటు ఆయా పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గాలు ఏర్పాటైన పక్షంలో గ్రామాల్లోని సమస్యలు పరిష్కారం కావడంతోపాటు అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
రాష్ర్టంలో నెలకొన్న అనిశ్చితి తొలగడంతోపాటు సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఆరు నెలలపాటు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించడంతో మండల పరిషత్ ప్రత్యేక అధికారుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. వచ్చేది ఎన్నికల సీజన్ అయినందున ఆ విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ఈ దశలో ప్రత్యేక అధికారుల పాలన కష్టతరమయ్యే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
రెండున్నరేళ్లుగా..
గత రెండున్నరేళ్లుగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేవు. ఈ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. 2011 జూలైలో మొదలైన ప్రత్యేక అధికారుల పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. 2011 జూలై 21తో జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో 2011 జూలై 22 నుంచి ప్రభుత్వం జడ్పీ ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారి పాలన గడువు 2012 జనవరి 22తో ముగియగా ఆ వెంటనే మరో ఆరు నెలలపాటు ప్రత్యేక పాలనను పొడిగించింది.
ప్రభుత్వం ఇలా ఇప్పటి వరకూ ఆరు పర్యాయాలు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ వచ్చింది. ఇదే తరహాలో మండల పరిషత్ ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగిస్తూనే వచ్చింది. జిల్లాలో 46 మండల పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం 2011 జూలై 20తో ముగిసింది. దీంతో ప్రభుత్వం 2011 జూలై 22న మండల పరిషత్ ప్రత్యేక అధికారులను నియమించింది. అప్పటినుంచి ఆరు పర్యాయాలు ప్రత్యేక పాలనను పెంచుతూ వస్తోంది.