శ్రోతాభిరామం
రేడియో అంతరంగాలు
నేడు వరల్డ్ రేడియో డే
‘రేడియో రామం’ గా ఎస్.బి. శ్రీరామమూర్తి శ్రోతలందరికీ సుపరిచితం! రేడియోలో ఆయన ఎంత వినూత్నంగా కార్యక్రమాలను రూపొందించగలరో.. మాండలిన్తో సరిగమలనూ అంతే హృదయ రంజకంగా వినిపించగలరు. కాన్వాస్ మీద అంత సృజనాత్మకంగాను చిత్రాలను గీయగలరు! ఇలా తనకు తెలిసిన అన్ని విద్యలతో తెలుగు రేడియోకి విలక్షణ కళాకారుడైన రామం... ఈవారం ‘రేడియో అంతరంగాలు’ కు శారదా శ్రీనివాసన్ ఎంచుకున్న ఆత్మీయ అతిథి.
(శ్రీరామమూర్తినిశారదా శ్రీనివాసన్ కూడా ఆప్యాయంగా రామం అనే పిలుస్తారు. ఆయన కూడా శారద అత్తా, శ్రీనివాసన్ మామా అంటూ వాళ్లని అంతే ఆప్యాయంగా పిలుస్తారు. విజయవాడ ఆకాశవాణి నుంచి రామం రిటైరై పన్నెండేళ్లవుతోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శారదా శ్రీనివాసన్.. రామంను మళ్లీ ఒకసారి కలుసుకున్నారు. వారి సంభాషణ అలా.. ఆ పాత జ్ఞాపకాలతోనే మొదలైంది).
మహామహులు పనిచేసిన విజయవాడ రేడియోస్టేషన్లో నువ్వూ పనిచేశావు. అప్పటి నీ అనుభవాలు, అనుభూతులు తెలుసుకోవాలని వచ్చాను రామం....
నిజంగానే అది నా అదృష్టం అత్తా! 1972లో విజయవాడ కేంద్రానికి పర్మినెంట్ అనౌన్సర్‌గా వెళ్లినా 1968 నుంచే రేడియోతో నాకు సంబంధాలున్నాయి. దానికన్నా ముందు.. డిగ్రీ అయిపోగానే మద్రాసు వెళ్లి అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీ, సౌండ్, ప్రాసెసింగ్ విభాగాల్లో మూడేళ్లు కోర్సు చేశాను.
మరి సినిమాలకు వెళ్లకుండా రేడియో వైపు వచ్చావేం?
ఈ ప్రశ్నే రేడియో ఉద్యోగం కోసం చేసిన ఇంటర్వ్యూలోనూ అడిగారత్తా! ‘ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడివి.. రేడియోలోకొస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. ఉద్యోగం ఇవ్వం’ అని కూడా అన్నారు. అప్పుడు నేను చెప్పా.. ‘ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవుతుందండి, డిస్ క్వాలిఫికేషన్ కాదు. నేను అక్కడ నేర్చుకున్న రికార్డింగ్, ఎడిటింగ్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ ఉపయోగిస్తాను. ప్రూవ్ చేస్తాను ఉద్యోగం ఇస్తే’అని! ఇచ్చారు.
యువవాణితో మొదలు
1968లో ఆల్ ఇండియా రేడియోలో యువతను ప్రోత్సహించడానికి యువవాణిని మొదలుపెట్టారు. అప్పుడే మద్రాస్ నుంచి కాకినాడ వచ్చేశాను. ఈ యువవాణిని వింటుండేవాడిని. ‘అరే.. బాగుందే.. మనం కూడా ఏదైనా రాయొచ్చు, చేయొచ్చు’ అనిపించింది. విజయవాడ వెళ్లి ఎవరినైనా కలుసుకుని వద్దాం అని బయలుదేరి వెళ్లా. ‘ఏంచేస్తావేంటీ’ అని అడిగారు. ‘మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్’ అని చెప్పాను. ‘ప్రతి శుక్రవారం మార్నింగ్ ఒక అరగంట ఫిల్మ్ రికార్డులు వేసే కార్యక్రమం ఉంది. ముందది చేయండి. తర్వాత మీరేమైనా రాసుకొని పట్టుకొస్తే అప్పుడు చూద్దాం’ అన్నారు. అలా రేడియోలో సినిమారికార్డులు వేసే పనితో నేను ఉద్యోగానికి ముందే ఎంటర్ అయ్యానన్నమాట.
స్టేషన్‌కే కొత్త ఐడియా
కొన్ని రోజులకి నేనే ఓ ప్రోగ్రామ్ రూపొందించా. మూడ్ మ్యూజిక్ కాన్సెప్ట్‌తో. మద్రాస్‌లో ఉన్నప్పుడు ఓ షార్ట్‌ఫిల్మ్ కోసమని రాసుకున్న స్క్రిప్టునే ఇక్కడ ప్రోగ్రామ్‌గా మలిచా. ప్రకృతిలోని చక్కటి దృశ్యాన్ని చూస్తుంటే చక్కటి సంగీతాన్ని వింటున్న అనుభూతి కూడా కలుగుతుంది. అనాహత శబ్దం అంటామే అది. దీన్ని నేను రివర్స్‌లో చెప్పటానికి ట్రై చేశా ఆ ప్రోగ్రామ్‌లో. ఎలాగంటే ముందుగా ఓ ప్రభాత దృశ్యాన్ని వర్ణించి.. వెంటనే పండిట్ రవిశంకర్ సితార్ మీద మీటిన ఆహిర్భైరవి రాగాన్ని వినిపించేవాడిని. తర్వాత రెండిటినీ సమన్వయం చేస్తూ కామెంట్ చెప్పేవాడిని. అలా ఏడెనిమిది దృశ్యాలు వర్ణించేవాడిని. దశ్యాన్ని శబ్దీకరించడమన్నమాట. దీనికి నన్ను ప్రోత్సహించిందెవరనుకున్నారు? మహా విద్యాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు. చిన్నకుర్రాడిని వెళ్లి.. శాస్త్రీయ సంగీతాన్ని బేస్ చేసుకొని ఓ ప్రోగ్రామ్ చేస్తానంటే.. ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ‘నాతో రా, సాయంకాలం మాట్లాడుకుందాం’ అన్నారు. విజయవాడలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన ఈవినింగ్వాక్కి వెళ్లేవారు. అలా నన్నూ తీసుకెళ్లి నేను చెప్పింది చక్కగా ఓపిగ్గా విని ‘ఐడియా చాలా బాగుందండీ.. మా స్టేషన్‌కే కొత్త ఐడియా’అన్నారు. నాకొచ్చిన ఎన్నో రేడియో జాతీయ అవార్డులన్నిటికంటే గొప్ప అవార్డు ఆ మాట. నేను రూపొందించిన ప్రోగ్రామ్ విని బాగా ఇంప్రెస్ అయ్యి ఓ చక్కటి ఇంట్రడక్షనూ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు ‘భావనా సంగీతం’! ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం. దీనికి నాకందిన పారితోషికం 20 రూపాయలు.
పుట్టినరోజు గిఫ్ట్
అలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే రేడియోలోనే పర్మినెంట్ ఉద్యోగంలో చేరే అవకాశం కోసం చూస్తుండే వాడిని. అప్పట్లో ‘వాణి’ అనే రేడియో పక్షపత్రికొచ్చేది. అందులో ఆకాశవాణికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్సూ వేసేవారు. ప్రోగ్రామ్స్ హడావిడిలో ఉండి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. వైజాగ్‌లో ఓ ఖాళీ ఉందని తెలిసివెళ్లాను. ఆడిషన్లో పాసయ్యాను. అందులో నా నంబర్ 11. ముగ్గురికి అవకాశమిచ్చి మిగతావాళ్లను ఆపారు. అలా నేను పెండింగ్ లిస్ట్‌లో ఉన్నాను. అప్పుడే అదృష్టవశాత్తు వివిధభారతిలో కొత్తగా తెలుగు సర్వీస్ మొదలయింది హైదరాబాద్, విజయవాడలో. ఆ సర్వీస్‌ని సీబీఎస్ అనిపిలిచేవాళ్లు అంటే కమర్షియల్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్. దానికి అనౌన్సర్స్ని తీసుకుంటున్నారని తెలిసి వెళ్లాను. అప్పటికే నేను పెండింగ్లిస్ట్లో ఉన్నాను కాబట్టి వీళ్లు నన్ను తీసుకునే ఛాన్స్ ఉంటుందని విజయవాడకు వెళ్లాను. అక్కడ అవకాశం దొరకలేదు. ఓలేటి వెంకటేశ్వర్లుగారి సలహా మేరకు హైదరాబాద్ వచ్చాను. శ్రీనివాసన్ మామను కలిశాను. కొంత టైమ్ పట్టినా హైదరాబాద్ వివిధభారతిలో అనౌన్సర్‌గా చేరాను. అది 1971, జూన్ 3న. ఆ రోజు నా పుట్టినరోజు. గుర్తుందా.. అత్తా.. ఆ కాంట్రాక్ట్‌ను మీరే పట్టుకొచ్చి ఇచ్చారు.. నా పుట్టినరోజు గిఫ్ట్‌గా!’.
ఎందుకు గుర్తులేదూ.. గుర్తుంది రామం...
తర్వాత ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది. కాకపోతే విజయవాడ పోస్టింగ్. యేడాదిగా హైదరాబాద్‌లో అందరూ క్లోజ్ అయ్యేసరికి విజయవాడ వెళ్లడానికి మనసొప్పలేదు. సీనియర్ ఎనౌన్సర్లు డి.వెంకటరామయ్యగారు, శమంతకమణిగారు, రత్నప్రసాద్గారు.. ‘విజయవాడలో కన్సోల్ దగ్గర కాళ్లు పెట్టుకోవడానికి పీటలాంటిది తయారుచేశారట శ్రీరామ్మూర్తీ.. హాయిగా అక్కడికి వెళ్లు’అంటూ నా మీద జోక్స్ వేశారు. ఇక్కడే ఉంటానని స్టేషన్ డెరైక్టర్ కందస్వామిని రిక్వెస్ట్ చేశాను కూడా. ఆయన నన్ను సముదాయించి విజయవాడ పంపించారు.
బాలాంత్రపు రజనీకాంతరావుగారు మొట్టమొదటి మా స్టేషన్ డెరైక్టర్. ఆయన మాకు గురువు, దైవం అన్నీ! ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్, టెక్నికల్ విషయాల పట్ల ఆసక్తి, అవగాహన నా రేడియో కెరీర్‌కి ప్లస్పాయింట్స్ అయ్యాయి. అందుకే నా ప్రోగ్రామ్స్‌ని శబ్దచిత్రాలు అని పేరుపెట్టుకున్నాను. అంటే శబ్దం ద్వారా చిత్రాన్ని చూపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రామ్‌కి నేను సరిపోవడం, నాకు మంచి ప్రోగ్రామ్ రావడం.. రెండూ కుదిరాయి అత్తా. ఒక్కో కార్యక్రమం ఒక్కో జ్ఞాపకం. గొప్ప అనుభూతి. ప్రశంసలు, నేర్చుకునేలా చేసిన విమర్శలు,పెద్దపెద్ద వాళ్ల సాంగత్యం, విడదీయలేని అనుబంధం.. ఇవన్నీ రేడియో ఇచ్చిన సంపదలే! చెప్పాలంటే రోజైనా పడుతుంది!
ప్రెజెంటేషన్: సరస్వతి రమ
ఫొటో: గోదాసు రాజేష్
‘ఒక పాటపుట్టింది’ ప్రోగ్రామ్ చేశా కదా ఆ ఐడియా ఎలా వచ్చిందంటే..?
రేడియో స్టేషన్లో ఓ పాట ఎలా రికార్డ్ అవుతుందో అనుకునే ఓ సగటు శ్రోత కుతూహలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ రూపొందించాను. ప్రసారం అయ్యాక ఎంత రెస్పాన్స్ వచ్చిందో. నా ఫస్ట్ ప్రోగ్రామ్ నీలినీడలు కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమమే. ఆ మాటకొస్తే ఒక పాట పుట్టింది ప్రోగ్రామ్ చేసేటప్పటికే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కింద నాకు నాలుగైదు అవార్డులు వచ్చి ఉన్నాయి. ఈ ప్రోగామ్కీ అవార్డు వచ్చింది. ఇలాంటివి చాలా చేశాను. ‘మెట్లు’ అనే కాన్సెప్ట్ తీసుకొని జీవితంలో మెట్లకున్న ప్రాధాన్యాన్ని చెప్పడానికి రకరకాల థీమ్స్‌తో ప్రోగ్రామ్ చేశాను. ఒకసారి విజయం, పరాజయాలకి చిహ్నంగా, ఇంకోసారి బుద్ధుడి భాగస్వామి యశోధర ప్రధానపాత్రగా శ్రవణనాటకాన్ని రూపొందించాను. ఒకరకంగా ఇది స్త్రీవాద ధోరణిలో సాగే నాటకం. ఇలా చాలా ప్రయోగాలు చేశాను... కేవలం శబ్దాన్ని మాత్రమే ఓరియెంటేషన్‌గా తీసుకుంటూ! జీవితంలో పెరిగిన వేగం మీదా కామెడీ ప్రోగ్రామ్ రూపొందించాను.. ‘చూసిందే మళ్లీ చూడు’ అనే పేరుతో. ఇలాంటి నా కార్యక్రమాలకు పదీపన్నెండు రేడియో జాతీయ అవార్డులు వచ్చాయి.