అన్వేషణం: పసుపు పూసిన నేల... హాజాంగ్
‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా చూశారా? కాజల్‌కి మాండలిన్ సంగీతం వినిపిస్తుంది. షారుఖ్ వచ్చాడని అర్థమై పరుగు పరుగున వెళ్తుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో గుర్తుందా? పసుపు రంగు పూల తోటలోకి. అటు పెద్దవీ ఇటు చిన్నవీ కాని మొక్కలకు పూచిన పసుపు రంగు పూలు తెరమీద ఎంత బాగా కనిపించాయో కదా! మరి వాటిని ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది! ఆ అనుభూతిని సొంతం చేసుకోవడానికి సరిైయెున చోటు... చైనాలోని హాజాంగ్.
చైనాలోని ల్యోపింగ్ కౌంటీలో ఉన్న హాంజాంగ్ గ్రామంలో... కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది పసుపు, బంగారు వర్ణాలు కలగలసిన కనోలా పూలతోట. నేలకు పసుపు రంగు పూశారా అన్నంత అందంగా ఉన్న ఆ పూల సౌందర్యాన్ని చూడ్డానికి వేయి కనులు కావాలి. నిజానికి ఈ మొక్కలు చైనా అంతటా ఉంటాయి. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఉండేది మాత్రం ఇక్కడే. దాదాపు అరవై ఆరు ఎకరాల్లో ఉన్న కనోలా మొక్కలు ఆ ప్రాంత స్వరూపాన్నే మార్చేశాయి. అందుకే హాంజాంగ్‌ను ‘గోల్డెన్ సీ ఆఫ్ కనోలా’ అంటారు.
కనోలా మొక్కలు కేవలం పూలమొక్కలు కావు. ఇవి నూనెను అందిస్తాయి. కనోలా పూల నుంచి గింజలు వస్తాయి. వాటి నుంచి నూనెను తీస్తారు. అక్కడ కనోలా నూనె వ్యాపారం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇన్ని వేల ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు. ఈ పూలు వసంత కాలంలో విచ్చుకుంటాయి. అందుకే ఆ సమయంలో సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం యేటా వసంత మాసంలో ‘హాంజాంగ్ టూరిస్ట్ ఫెస్టివల్’ను నిర్వహిస్తోంది. ఫొటోగ్రాఫర్లకి, సినిమా వాళ్లకి అత్యంత ఇష్టమైన ప్రదేశమిది. కనోలా అందాలను కెమెరాలో బంధించేందుకు వాళ్లంతా పోటీ పడుతూ ఉంటారు!
ఏ ఇల్లు ఎవరిదో తెలిసేదెలా!
ఇటలీలోని బారి ప్రావిన్స్‌లో ఉన్న అల్బెరోబెల్లో గ్రామ జనాభా దాదాపు పదకొండు వేలు. ఊరిలో ఏ ఇల్లు ఎవరితో గుర్తు పెట్టుకోవడం తలకు మించిన పని. ఎందుకంటే, ఎక్కడైనా ఒకట్రెండు ఇళ్లు తప్ప మిగతావన్నీ ఒకేలా (ఫొటోలో చూపినట్టుగా) ఉంటాయి. రాతితో నిర్మించి, సున్నం వేసిన ఇంటిమీద ఆకులతో వేసిన పైకప్పు, పైన సూదిగా ఉండి దాని మీద పిడిలా ఉండే విచిత్రమైన నిర్మాణ శైలితో ఉంటాయి ఆ ఇళ్లు. వాటిని స్థానికులు ‘ట్రుల్లీలు’ అంటారు. ట్రుల్లీ అంటే ‘రాళ్లతో కట్టిన ఇల్లు’అని అర్థం.
ఈ ట్రుల్లీలను కొన్ని శతాబ్దాల క్రితం గోడౌన్లుగా వాడేవారు. అందుకోసమే ఈ ప్రాంతంలో చాలా ట్రుల్లీలను నిర్మించారు. అయితే ఆధునిక పద్ధతులు వచ్చాక వీటి వాడకం తగ్గింది. ఆ తర్వాత వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన కొందరు వీటిని తమ నివాసాలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఎవరు ఇల్లు నిర్మించుకున్నా, ఈ ఆకారంలోనే కట్టుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఆ ఊరిలో ఇళ్లన్నీ ఒకేలా ఉంటాయి. అందుకే కొత్తవాళ్లు వెళ్తే, ఏ ఇల్లు ఎవరిదో తెలీక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు.