శిల్పా వర్సెస్ మాండ్ర
- పనుల కోసం టీడీపీ నాయకుల కుమ్ములాట
- టెండర్లువేసి పనులను చేస్తున్న శిల్పా వర్గీయులు
- అడ్డుకున్న మాండ్ర వర్గీయుల
- డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన
పోతిరెడ్డిపాడు డీఈ రమేష్‌బాపూజీ
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): కాంట్రాక్ట్ పనుల విషయంలో టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. తమ అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారని మాండ్ర వర్గీయలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా వర్గీయులు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రూ.6.55కోట్ల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అప్రోచ్ కాల్వ ఆధునికీకరణ పనులకు టెండర్లు వేసి శిల్పా వర్గీయులు 26శాతం లెస్‌కు దక్కించుకున్నారు. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు మాండ్ర వర్గీయులు ఫోన్‌చేసి తమ అనుమతిలేకుండా మీరెలా పనులు చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ విషయమై.. మాండ్ర తాను చెప్పిన తరిగోపుల, తాటిపాడు గ్రామాలకు చెందిన నాయకులకు తలా రూ.2కోట్ల పనులను అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకు పనులు దక్కించుకున్న వారు అంగీకరించకపోవటంతో వాటిని నిలుపుదలచేయించాలని మాండ్ర తన అనుచరులను పురమాయించారు. దీంతో పగిడ్యాలకు చెందిన పలుచాని మహేశ్వరరెడ్డి, జయసూర్యలతో పాటు మరికొంత మంది వచ్చి పనులను నిలిపివేయించారు. దీంతో కాంట్రాక్టర్ జరిగిన విషయాన్ని నందికొట్కూరు సీఐ వెంకరటమణకు తెలియజేయటంతో ఆయన పట్టించుకోలేదు.
దీంతో పోతిరెడ్డిపాడు డీఈ రమేష్ బాపూజీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పనులను అడ్డుకున్న వారిపై ఆత్మకూరు డీఎస్పీ సుప్రజకుఫిర్యాదు చేశారు. సంఘటన సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని ఆత్మకూరు సీఐ కృష్ణయ్యయాదవ్‌ను డీఎస్పీ ఆదేశించారు. రెండోపర్యాయంగా సాయంత్రం సుమారు 20 మంది వ్యక్తులు ట్రాక్టర్లో వచ్చి పనులను అడ్డుకున్నారు. దీంతో విషయాన్ని కాంట్రాక్టర్ నేరుగా జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు వివరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు సీఐ, నందికొట్కూరు సీఐ వారి సిబ్బందితో పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని అడ్డుకుంటున్న వారిని మందిలించి పంపించారు.
డీఎస్పీకి పిర్యాదు చేశాం: రమేష్‌బాపూజీ, డీఈ పోతిరెడ్డిపాడు
పనులను అడ్డుకున్న వారిపై డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన మాటవాస్తవమే. ప్రభుత్వం తలపెట్టిన పనులను అడ్డుకోవటం చట్ట రీత్యానేరం రెండునెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఆదిలోనే పనులను అడ్డుకుంటే పనులు మందగించే అవకాశం ఉంది.