చేపల కూర అంటే మహా ప్రియం!
► కన్నడిగుళ్లంటే ప్రాణం
► మంగళూరు సుందరి, మిస్ సుప్రా
నేషనల్ కిరీట ధారిణి శ్రీనిధి శెట్టి
బెంగళూరు: తనకు చేపల కూర అంటే చాలా ఇష్టమని అదేవిధంగా కన్నడిగుళ్లంటే ప్రాణమని మిస్ సుప్రా నేషనల్ కిరీటాన్ని గెలుచుకున్న మంగళూరు బ్యూటీ శ్రీనిధి శెట్టి అన్నారు. పనామాకు చెందిన విశ్వబ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్ సుప్రా 2016 నేషనల్ కిరీటాన్ని సొంత చేసుకున్న ఆమె శనివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు భారతీయ వస్త్రధారణ, అందులోను లంగా, ఓణి, చీర ధరించడం ఎంతో ఇష్టమన్నారు.
పనామాకు చెందిన విశ్వబ్యూటీ అసోసియేషన్ సంస్థతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్ల చెప్పారు. ఇది పూర్తి అయిన అనంతరం మోడలింగ్, సినిమాల్లో అవకాశాలు లభిస్తే తన కార్యక్రమాలు విస్తరిస్తానని తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకు మోడలింగ్ అంటే ఇష్టమని ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్, లారాదత్తా తనకు స్ఫూర్తి అన్నారు. మిస్సుప్రా నేషనల్ కిరీటం దక్కడం తాను కలలో కూడా ఊహించలేదన్నారు. బెంగళూరు జైన్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను రెండేళ్ల పాటు బెంగళూరులోని ఆక్సెంచర్ కంపెనీలో పనిచేశానన్నారు. తాను ఎటువంటి ఆహారం తీసుకున్నా బరువు పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు మంగళూరు సందరి శ్రీనిధి.