మాల్యాకు ఎదురుదెబ్బ
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎండీగా పునర్నియామకాన్ని తిరస్కరించిన కేంద్రం
మంగళూరు కెమికల్స్ డెరైక్టర్ పదవికి రాజీనామా
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎండీగా మాల్యా పునర్నియామకాన్ని కేంద్రం తాజాగా తిరస్కరించింది. మరోవైపు గ్రూప్ సంస్థ మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఎంసీఎఫ్ఎల్) డెరైక్టర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇందుకు గల కారణాలు మాత్రం వెల్లడించ లేదు.
మాల్యా పునర్నియామకానికి సంబంధించిన దరఖాస్తును కేంద్రం తిరస్కరించిందని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సోమవారం స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. దీనికి కారణాలను తెలపనప్పటికీ.. పునర్నియామకం విషయంలో ఇటు రుణదాతల నుంచి, అటు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు పొందడంలో కింగ్‌ఫిషర్ విఫలమైనందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఎంసీఎఫ్ఎల్ డెరైక్టర్ పదవికి ఆయన రాజీనామా చేసిన రోజే ఈ అంశం కూడా వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు గాను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, గ్రూప్‌లో మరో అనుబంధ సంస్థ యూబీ ఇంజినీరింగ్ షేర్లలో ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు సోమవారం నిలిపివేశాయి. యూబీ గ్రూప్‌లో భాగమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మార్కెట్క్యాప్ ఒకప్పుడు రూ. 10,000 కోట్ల పైచిలుకు ఉండగా.. రుణాలు, నష్టాల భారంతో ప్రస్తుతం రూ. 100 కోట్ల స్థాయికి పడిపోయింది.