బాక్సైట్‌పై ఐక్యపోరాటానికి మావోయిస్టుల పిలుపు
జి.మాడుగుల: మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసేవరకు ఆదివాసీలంతా ఐక్యంగా పోరాటాలు చేయాలని సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శి మంగ్లన్న బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విశాఖ ఏజెన్సీలో లక్షలాది మంది నేటికీ అడవే సర్వస్వంగా బతుకుతున్నారని, తరతరాల నుంచి అటవీ, ఖనిజ, జల సంపదలను అనేక పోరాటాలతో కాపాడుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు పుండుపై కారంలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాక్సైట్ చిచ్చుపెట్టి ఏజెన్సీలో మళ్లీ అశాంతి సృష్టించారని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, కంపెనీల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం, నదులు, అడవులన్నీ కొల్లగొట్టడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని, అక్రమ కేసులు బనాయించి జైళ్లల్లో తోస్తున్నారని, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.