పింఛన్ల బట్వాడాలో ‘ఆధార్’ సేకరణ తప్పనిసరి
అనంతపురం సప్తగిరిసర్కిల్: ‘ఆధార్’ ఇవ్వని లబ్ధిదారుల నుంచి ప్రస్తుతం చేపట్టిన పింఛన్ల బట్వాడాలో తప్పనిసరిగా నంబరును సేకరించాలని డీఆర్డీఏ పీడీ కే.నీలకంఠరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం తన చాంబర్ నుంచి మండల స్థాయి అధికారులు, ఫినో, మణిపాల్ కంపెనీ ప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలైకి సంబంధించి శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు 4,10,388 మందికి పింఛన్ల పంపిణీ కొనసాగుతోందన్నారు.
ఆధార్ కార్డు నంబర్ ఇవ్వని వారి జాబితా అన్ని మండలాలకు పంపించామని తెలిపారు. ఎన్రోల్ చేయని వారిని ఆధార్ కేంద్రాలకు పంపి, వారి నుంచి ఈ నాలుగు రోజుల్లో ఐడీ నంబర్ తీసుకోవాలని, అలసత్వం వహించరాదని సూచించారు. ఆధార్ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఆషామాషీగా తీసుకోరాదని ఆదేశించారు. కొందరు అధికారులు, బట్వాడా చేసే సిబ్బంది పనితీరుపై ఈ సందర్భంగా పీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 25 వేలు, గ్రామీణ ప్రాంతాల నుంచి 35 వేల మంది నుంచి ఆధార్ రావాల్సి ఉందన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో ఏపీడీ స్వరూప్, పింఛను విభాగం అధికారి నజీర్, తదితరులు పాల్గొన్నారు.