'మణిపూర్ దాడి మా పనే'
ఇంఫాల్: ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను హతమార్చింది తామేనని ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఘటనకు బాధ్యవవహిస్టున్నట్లుగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నాగాలాండ్ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ తో గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై గురువారం ఈ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరగా.. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే మిలిటెంట్లు ఆ వాహన శ్రేణిని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.
గడిచిన ముప్పై ఏళ్లలో భారత సైన్యం పై జరిగిన భారీ దాడి ఇదే. దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట ను ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కాల్పుల ఘటనను దర్యాప్తుచేస్తోంది.