మణిపూర్‌లో జనం ఇబ్బందుల మధ్య ఎన్నికలు
(సాక్షి నాలెడ్జ్సెంటర్)
మణిపూర్ 11వ అసెంబ్లీ ఎన్నికలు రెండున్నర నెలల్లో జరగాల్సి ఉండగా ఎన్నికల వేడి ఇంకా రాజుకోలేదు. నవంబర్ ఒకటి నుంచీ యునైటెడ్ నాగా కౌన్సిల్(యూఎన్సీ) పిలుపుపై ఆర్థిక దిగ్బంధం అమలవుతోంది. అదే నెల మొదలైన నోట్ల మార్పిడీ తోడవడంతో మణిపూర్ ప్రజలు నిత్యావసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణిపూర్‌లో నాగా మాతృభూమిలో భాగంగా పరిగణించే కొన్ని ప్రాంతాలను నాగాలాండ్‌లో కలిపి విశాల నాగాలిం ఏర్పాటు చేయాలనేది ఇక్కడి నాగాల దీర్ఘకాలిక డిమాండ్. 60 అసెంబ్లీ సీట్లున్న ఈ రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో నాగాలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. తమ జనాభా ఉన్న జిల్లాల్లో నాగాల ప్రాధాన్యం తగ్గించడానికి కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని దిగ్బంధంతో ప్రతిఘటించాలని యూఎన్సీ భావించింది. ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబీ సింగ్ మంత్రివర్గం డిసెంబర్ 8 అర్థరాత్రి సమావేశమై మొత్తం 9లోని ఏడు జిల్లాలను చీల్చి ఏడు కొత్త జిల్లాలు ఏర్పాటుచేసింది. ఒక పక్క మణిపూర్‌లోని నాగాల సమస్య పరిష్కారానికి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం(ఇసాక్-మూయివా)తో కేంద్రం చర్చలు జరుపుతోంది.
మరో పక్క ఈ దిగ్బంధం విరమించకపోవడం, నాగాలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరించడంతో రాష్ట్రంలో ఇంకా ఎన్నికల వేడి మొదలవలేదు. మార్చి4, 8 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, సీఎం ఇబోబీసింగ్ నాయకత్వంలో15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వరసగా నాలుగో విజయానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. 2002 అసెంబ్లీ(9వ) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఇబోబీ వరుసగా 2007, 2012 ఎన్నికల్లో కూడా పార్టీని విజయపథంలో నడిపించారు. ఇలా విరామం లేకుండా 15 ఏళ్లు సీఎంగా ఉండి మణిపూర్‌లో ఆయన కొత్త రికార్డు సృష్టించారు. అంతకు ముందు మూడు వేర్వేరు సందర్భాల్లో సీఎంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత రిషాంగ్ కేషింగ్ దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించారు. 2002 వరకూ రాజకీయ సుస్థిరతకు దూరమైన మణిపూర్‌లో టెరిటోరియల్ అసెంబ్లీ ఏర్పడిన 1963 జనవరి నుంచీ 19 సర్కార్లు అధికారంలోకి వచ్చాయి.
కాంగ్రెస్ ఆధిపత్యం
2002 ఎన్నికల్లో 20 సీట్లు సాధించిన కాంగ్రెస్ తర్వాత మెజారిటీ కూడగట్టి అయిదేళ్లూ పాలించింది. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లూ 42 సీట్లు సాధించి రాజకీయంగా ఎదురులేకుండా పాలన సాగించింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో సైతం రాష్ట్రంలోని రెండు స్థానాలూ గెలుచుకుంది. బీజేపీ తరఫున ఇన్నర్ మణిపూర్ నుంచి పోటీచేసిన టీహెచ్ చావ్బాసింగ్ వరుసగా 1996, 98, 99 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అప్పటి ఏబీ వాజ్‌పేయి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. తర్వాత బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, 2002 ఎన్నికల్లో కాషాయపక్షం దాదాపు పది శాతం ఓట్లతో నాలుగు సీట్లు సాధించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఒక్క సీటూ బీజేపీకి దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో మిత్రపక్షం నాగాపీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి అధికారం కోసం పోటీపడుతోంది.
విలీనం నుంచి రాజకీయ సంక్షోభం
దేశంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే మణిపూర్ కూడా రాజరిక పాలనలో వందలాది ఏళ్లు ఉంది. బ్రిటిష్ పాలకుల సార్వభౌత్యాన్ని అంగీకరించాక మణిపూర్ హిందూ రాజకుటుంబం పాలన 1949 వరకూ సాగింది. 1949 అక్టోబర్ 15న భారత్‌లో ఈ రాజ్యాన్ని మణిపూర్ పాలకుడు విలీనంచేస్తూ షిల్లాంగ్‌లో సంతకం చేశారు. అప్పటి నుంచీ స్థానిక మెజారిటీ మెయితీ హిందూ వర్గంలోని కొందరు స్వాతంత్య్రం కోసం హింసామార్గాన్ని ఎంచుకున్నారు. 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన మణిపూర్‌ను 1972 జనవరిలో పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది. కొన్ని మార్క్సిస్ట్ తీవ్రవాద సంస్థలు కేంద్రంపై 1964 నుంచీ పోరాటం సాగిస్తున్నాయి. మరోపక్క నాగాలు తమ ప్రాంతాలను నాగాలాండ్‌లో విలీనం చేయాలంటూ పోరుసాగిస్తున్నారు. రాష్ట్రంలో హిందువులు, క్రైస్తవులు దాదాపు సమాన సంఖ్యలో(41 శాతం) ఉన్నారు. పదేళ్లు పాలించిన రిషాంగ్ కేషింగ్ నాగా కావడం విశేషం.
మణిపూర్ జనాభా: దాదాపు 30 లక్షలు
లోక్‌సభ సీట్లు: రెండు
అసెంబ్లీ: 60 సీట్లు
2012 ఎన్నికల ఫలితాలు
కాంగ్రెస్–42
తృణమూల్ కాంగ్రెస్–7
మణిపూర్స్టేట్ కాంగ్రెస్–5
ఎన్పీఎఫ్–4