గెలుపు గ్రామర్
విజయం సాధించడంలో ఎంత కిక్ ఉందో....ఇతరులను విజయం సాధించేలా చేయడంలో అంత కంటే ఎక్కువ కిక్ ఉంది!ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ప్రిప్‌ఇన్‌స్టా’తో ఆశయ్ మిశ్రా, కౌశిక్, మనీష్ అగర్వాల్‌లు విజయం సాధించడమే కాదు యువత తమ కలలు సాకారం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు...
కౌశిక్, ఆశయ్ మిశ్రా, మనీష్ అగర్వాల్‌లు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విఐటీ యూనివర్శిటీ, తమిళనాడు)లో కలిసి చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత బెంగళూరులో వేరు వేరు కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు.‘చాలామంది స్టూడెంట్స్‌లో ప్రతిభ ఉన్నా తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి కారణం వారిలో సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పాటు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడంలో అనుసరించాల్సిన వ్యూహంపై అవగాహన లేకపోవడం...’ ఇలాంటి ఆలోచనలను రెగ్యులర్‌గా బ్లాగ్‌లో రాసేవాడు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న కౌశిక్.తన బ్లాగ్ ఎంత హిట్ అయిందంటే సంవత్సరం తిరిగేసరికల్లా నెలకు లక్ష వ్యూలు వచ్చేవి.ఆ టైమ్‌లోనే కౌశిక్‌కు ‘ఫ్లిప్‌కార్ట్’ నుంచి మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది.
అయితే దాన్ని కాదనుకొని ఇద్దరు మిత్రులతో మాట్లాడాడు.అలా ఈ ముగ్గురి మేధో మథనం నుంచి పుట్టిందే... ప్రిప్‌ఇన్‌స్టా.ప్రిప్‌ఇన్‌స్టా(ప్రిపేర్ ఫర్ ప్లేస్‌మెంట్స్ ఇన్స్టంట్లీ) అనేది వోటీటీ ఫార్మట్ ప్లాట్‌ఫామ్. యూజర్లు డబ్బులు చెల్లించి ఫిక్స్డ్ టైమ్‌లో(నెలలు లేదా సంవత్సరాలు) 200 కోర్సులతో యాక్సెస్ కావచ్చు.
అప్స్కిలింగ్ సబ్జెక్ట్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (లాజిక్, వెర్బల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్)...మొదలైనవి ఆ కోర్సులలో ఉంటాయి.‘ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్‌ఇన్‌స్టా తీసుకువచ్చాం. యూత్ తమ డ్రీమ్ జాబ్స్‌ను గెలుచుకునేలా చేయడంలో మా ప్లాట్‌ఫామ్ విజయం సాధించింది’ అంటున్నాడు కో–ఫౌండర్ ఆశయ్ మిశ్రా.
నోయిడా(ఉత్తర్‌ప్రదేశ్), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ యాభైకి పైగా కాలేజీలతో కలిసిపనిచేస్తుంది. రాబోయే కాలంలో మూడు వందల కాలేజీలతో కలిసి పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.‘మాది సెల్ఫ్–పేస్డ్ ప్లాట్‌ఫామ్. స్టూడెంట్స్ తమకు అనుకూలమైన టైమ్, షెడ్యూల్లో చదువుకోవచ్చు.బీ2సీ (బిజినెస్–టు–కన్జ్యూమర్) మోడల్లో ఈ ప్లాట్‌ఫామ్‌కు 2.25 లక్షల పెయిడ్ యాక్టివ్ సబ్స్రైబర్లు ఉన్నారు.
కోవిడ్ కల్లోల కాలంలో మాత్రం ఈ స్టార్టప్ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం సగానికి సగం పడిపోయింది. పేరున్న ఎడ్టెక్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. ‘నిరాశ’ మెల్లిగా దారి చేసుకొని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సమయంలో గట్టిగా నిలబడ్డారు ముగ్గురు మిత్రులు. కంపెనీని రీవ్యాంప్ చేశారు. ఉద్యోగుల సంఖ్యను పెంచారు.‘ఇక కనిపించదు’ అనుకున్న కంపెనీ లేచి నిలబడి కాలర్ ఎగరేసింది!
25 కోట్ల క్లబ్లో చేరిన ఈ స్టార్టప్ తన విస్తరణలో భాగంగా వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.రిస్క్ అనిపించే చోట ‘ప్లాన్ బీ’ను దృష్టిలో పెట్టుకోవడం మామూలే. అయితే ‘ప్లాన్ ఏ’ పకడ్బందీగా ఉంటే ‘బీ’తో ఏంపని? అని ఈ ముగ్గురు అనుకున్నారు. వారి నమ్మకం నిజమైంది .
ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్‌ఇన్‌స్టా తీసుకువచ్చాం. – ఆశయ్ మిశ్రా