ఒకే కాన్పులో ఐదుగురు ఆడ పిల్లలు
చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో మనితా సింగ్ అనే 25 ఏళ్ల గర్భవతి ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. సిజేరియన్ అవసరం లేకుండా సహజసిద్ధంగా ఐదుగురుకి ఒకే కాన్పులో జన్మనివ్వడం తన కెరీర్లో ఇదే మొదటిసారని డాక్టర్ టెకమ్ తెలిపారు. కేవలం 26 వారాలకే తల్లి మనితా సింగ్‌కు శనివారం నొప్పులు రావడంతో అంబికాపూర్ అస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత అరగంటకు నలుగురు ఆడబిడ్డలను ప్రసవించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తాము ఎప్పుడు స్కానింగ్ చేయించలేదని, కడుపులో ఒకే బిడ్డ పురుడుపోసుకుందని భావించామని తండ్రి మనిష్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓ బాబు పుట్టి పోయాడని, ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఆ నష్టాన్ని పూడ్చేందుకే దేవుడు ఏకంగా ఐదుగురు సంతానాన్ని ఒకేసారి ఇచ్చి ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఐదుగురు పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటానని, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
ఐదుగురు బిడ్డలు ప్రిమెచ్యూర్‌గా పుట్టారని, వారంతా కిలోన్నర చొప్పున బరువున్నారని డాక్టర్లు తెలిపారు. వారంతా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారిలో ఎంతమంది బతుకుతారో చెప్పలేమని, అయితే ప్రతి బిడ్డను బ్రతికించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని వారు తెలిపారు.