మా ( ...అమ్మ
ఉత్తర భారతంలో మాఁ అన్నా.. దక్షిణ భారతంలో అమ్మా అన్నా
ఆ తల్లి పంచేది ప్రేమే.. అది రుచి చూసిన ఎవరికైనా ఆమె మాఁ.. అమ్మ!
అలా జోధ్‌పుర్ కుర్రాడికి తమిళ అమ్మ మాఁ అయింది.
తమిళబ్బాయికి జోధ్‌పుర్ మాఁ అమ్మయింది.
ఈ అనుబంధానికి కనెక్షన్ మదర్ ఎక్స్ఛేంజ్ అయ్యింది.
దేవుడు తానన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు. కాని అమ్మ లేని చోట ఇంకో అమ్మ ఆదరణను పొందవచ్చని చెబుతోంది ‘మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’.
రాజస్థాన్.. జోధ్‌పుర్‌లోని మంజు భాటి
వాళ్లింట్లో ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మంజుకి ‘హలో మంజూజీ?’ అన్న స్త్రీ గొంతు వినిపించింది. ‘జీ.. ఆప్?’ మంజు ప్రశ్న.
‘మై నేమ్ ఈజ్ ఐశ్వర్య.. కాలింగ్ ఫ్రమ్ చెన్నై’
అవతలి నుంచి సమాధానం. ‘మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ జోధ్..’ అని ఐశ్వర్య తన సంభాషణను కొనసాగించబోతుంటే
‘నో ఇంగ్లిష్.. ఓన్లీ హిందీ’.. మంజు రిక్వెస్ట్.
‘ఓకే... మై హిందీ తోడా కుఛ్ జాన్తీ హు..’ అంటూ ఐశ్వర్య వచ్చీరాని హిందీలో, తమిళయాసతో జోధ్‌పుర్ ఐఐటీలో చదువుతున్న తన కొడుకు సంతోష్ గురించి చెప్పింది. అలాగే చైన్నైలో చదువుతున్న తన కొడుకు వివేక్ భాటి గురించి మంజు చెప్పింది. అలా ఆ ఇద్దరి అమ్మల మధ్య స్నేహం కుదిరింది. (ఈ విడియోను యూట్యూబ్‌లో చూడొచ్చు ‘మా కా ప్యార్.. ఘర్ కా ఖానా’ పేరుతో). వాళ్ల
అబ్బాయిలెలా ఉన్నారంటే..
బెంగతో చదువు భంగం..
సంతోష్, వివేక్ భాటీలిద్దరినీ హాస్టల్ తిండి ఇబ్బంది పెడుతోంది. చెన్నై సాంబార్,
చావల్.. వివేక్ భాటీ కడుపు నింపలేక పోతోంది. అమ్మ చేసే పరాఠాలను మరిపించలేక పోతోంది. సంతోష్దీ అదే పరిస్థితి. అమ్మ చేసే సాంబార్ ఘుమఘుమల ముందు ఆలూకుర్మా చిన్నబోతోంది. అతని పరాఠాలను అన్నంలా ఆస్వాదించలేకపోతున్నాడు. చదువు మీదకన్నా అమ్మ మీదకే వెళ్తోంది మనసు. సంతోష్ వాళ్లమ్మ ఐశ్వర్య, వివేక్ భాటీ వాళ్లమ్మ మంజుది కూడా ఇదే బాధ... పిల్లలు సరిగ్గా తినడంలేదు, ఎలా ఉంటున్నారో ఏమో అని. దీనికో పరిష్కారం దొరికితే బాగుండని అనుకుంటున్న సమయంలోనే తెలిసింది వీళ్లకు ‘అడానీ విల్మర్’ ప్రారంభించిన మదర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ గురించి.
మదర్ ఎక్స్ఛేంజ్
మదర్ఎక్స్ఛేంజ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈ ప్రోగ్రామ్‌లో తమ పేర్లను రిజిష్టర్ చేయించుకోవాలని తెలుసుకున్నారు. చేయించుకున్నారు. జోధ్‌పుర్‌లో ఉన్న ‘అమ్మ’ కోసం ఐశ్వర్య వెదికితే.. చెన్నైలో ఉన్న ‘మా’ కోసం మంజు వెదికింది. ఇద్దరికి ఇద్దరు తారస పడ్డారు. అలా ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. తన కొడుక్కి ఇష్టమైన వంటల గురించి ఐశ్వర్య చెపితే.. వాళ్లబ్బాయి నచ్చిన మెచ్చిన మెనూ గురించి మంజు చెప్పింది. రెసీపీలూ తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకున్నారిద్దరూ. ఓ మంచి మధ్యాహ్నం పరాఠా, కూర్మాలతో లంచ్‌బాక్స్ వెళ్లింది వివేక్ భాటీ క్యాంపస్‌కి. సాంబార్, అన్నంతో అటు సంతోష్కీ భోజనం అందింది. పిల్లల కళ్లలో ఆశ్చర్యం..అచ్చు అమ్మ చేతి రుచే.. మనసులో తడి.. తలతిప్పి చూస్తే వివేక్ భాటీ ముందు ఐశ్వర్య.. సంతోష్ ముందు మంజు.. ‘మా అమ్మలు’గా!
మా కా ప్యార్.. ఘర్ కా ఖానా..
ఈ ప్రోగ్రామ్‌కి బాగానే రెస్పాన్స్ వస్తోంది. చదువు కోసం ఉన్న ఊరును వదిలి పరాయి సిటీలకు వెళ్లిన పిల్లలకు తల్లి చేతి వంటతోపాటు ఆమె ఆదరణనూ ఇంకో అమ్మతో పంచుతున్నారు. ఇందులో చేరాలనుకునే తల్లులు తమ పేరు, ఫోన్ నంబరు, ఊరు వంటి వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిష్టర్ అయిన మదర్స్ అందరూ ఆ జాబితా ప్రకారం తమ పిల్లలు ఉన్న ఊళ్లో వాళ్లకు నచ్చిన అమ్మకు ఫోన్‌చేస్తారు. పరిచయం అయ్యాక వివరాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అలా ఇద్దరి మధ్య ముందు స్నేహం కుదురుతుంది. తర్వాత పిల్లల ఇష్టాయిష్టాలు, అభిరుచులు పంచుకుంటారు. ఏఏ కూరలంటే ఇష్టమో.. ఎలా చేస్తే తింటారో తెలుసుకుంటారు. వాటిని ఎలా వండాలో నేర్చుకుంటారు.. ఇవన్నీ ఫోన్ ద్వారే! పిల్లలకు ఇష్టమైన వంటను క్యారియర్‌లో పెట్టుకొని వాళ్లున్న హాస్టల్‌కు వెళ్తారు. దగ్గరుండి వడ్డిస్తారు. సొంత తల్లిలా మంచిచెడులను విచారిస్తారు. సెలవల్లో తమ కుటుంబంతో గడపడానికి ఇంటికి ఆహ్వానిస్తారు. సొంతింటికి వెళ్లిన భావనను పిల్లలకు కలిగిస్తారు. ఇదీ మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ అందిస్తున్న
‘మా కా ప్యార్.. ఘర్ కా ఖానా’!
- సరస్వతి రమ సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
హ్యాపీగా ఉంది..
మాది విజయవాడ. మూడేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. జావా డెవలపర్‌గా ఉద్యోగం. ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అమ్మ చెప్పిన ఒకే ఒక మాట... ‘వేళకు భోజనం చెయ్యి’ అని. ఊళ్లో ఉన్నప్పుడు ‘తిను తిను’అని అమ్మ వెంటపడ్తుంటే విసుగనిపించేది. ఇప్పుడు ఆ విసుగు కావాలనుకున్నా దొరకట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా తిన్నావా? అంటూ మొదలుపెడ్తుంది సంబాషణని. ఆ ప్రేమకు మొహం వాచినట్టే ఉంటోంది. ఊరెళ్లి వచ్చాకైతే కొన్ని రోజుల వరకు ఆ బెంగ తగ్గదు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వల్ల దొరుకుతోందంటే హ్యాపీగా ఉంది. - రావెళ్ల స్వాతి, హైదరాబాద్
నాలాంటి వాళ్ల కోసమే..
నా కొడుకు హర్ష రెండేళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. తింటున్నప్పుడల్లా
కాల్ చేస్తాడు.. ‘ఏం వండావమ్మా.. ఈ హాస్టల్ తిండి తినలేకపోతున్నా’ అని. వాడు! అలా బాధపడుతూంటే నాకిక్కడ ముద్ద దిగదు. వాడికి ఇష్టమైన వంటకం చేసినప్పుడల్లా ఎంత గుర్తొస్తాడో! అక్కడ నా కొడుకుకి ఇష్టమైనవి వండిపెట్టి, ధైర్యం చెప్పే ఆత్మీయులుంటే ఎంతబాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో! మదర్స్ ఎక్స్ఛేంజ్ గురించి తెలిసింది. నాలాంటి వాళ్లకోసమే పెట్టారేమో
అనిపిస్తోంది. - కె. శైలజ, ఉద్యోగిని, హైదరాబాద్
వీళ్లకు వరమే...
పదిహేనేళ్ల నుంచి ఆడపిల్లల హాస్టల్‌ను రన్ చేస్తున్నాను. వయసు నిమిత్తం లేకుండా అందరికీ అమ్మ మీద బెంగే. మా వంట ఎంతబాగున్నా ‘మా అమ్మయితే ఇంకా బాగా చేస్తారనే’ కామెంటే. అన్నిటికీ వాళ్లమ్మల తారీఫ్లే.
ఒక్కోసారి కోపం వస్తుంది.. కానీ చాలాసార్లు బాధేస్తుంటుంది పాపం పిల్లలు అని. మదర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వీళ్లకు వరమే కానీ మాలాంటి వాళ్ల బిజినెస్‌కి దెబ్బే
(నవ్వుతూ).
- ఎన్. ఉషారాణి, హైదరాబాద్