విభజన ప్రక్రియపై స్టే విధించలేం: సుప్రీంకోర్టు
* రాష్ట్ర విభజన వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
* ఈ పరిస్థితిలో జోక్యం చేసుకోలేం
* సరైన సమయంలో మళ్లీ వ్యాజ్యాలు వేసుకోవచ్చని పిటిషనర్లకు సూచన
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, అందుకిది సమయం కాదని న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్ఏ బాబ్డెల ధర్మాసనం శుక్రవారం తేల్చిచెప్పింది. ‘‘అయితే పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలను ఓపెన్‌గానే ఉంచుతున్నాం. సరైన సమయంలో పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చు’’ అని సూచించింది. ‘‘నవంబర్ 18, 2013న కూడా ఆంధ్రప్రదేశ్ విభజనపై దాఖలైన పిటిషన్లను విచారించాం. అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాం’’ అని పేర్కొంది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మనోహర్‌లాల్ శర్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ మిగిలిన ఎనిమిది పిటిషన్లపై కూడా సుమారు గంటన్నరపాటు ధర్మాసనం వాదనలు విన్నది. పిటిషనర్లు పయ్యావుల కేశవ్ తరఫున రోహింగ్టన్ నారిమన్, రఘురామ కృష్ణరాజు తరఫున పప్పు శ్యామల, విశాలాంధ్ర మహాసభ తరఫున ఎస్.రామచంద్రరావు, ముప్పాళ్ల సుబ్బారావు తర ఫున డి.ఎన్.రావు వాదనలు వినిపించారు. వారి వాదనలు..
ఇదే సరైన సమయం: మనోహర్‌లాల్ శర్మ
‘‘రాష్ట్రాల విభజన విషయంలో ఆర్టికల్ 3 విశేష అధికారాలను కలిగి ఉంది. అదే సమయంలో 1956లో ఆర్టికల్ 3కు జరిగిన 7వ సవరణ ప్రకారం కేంద్రానికి సైతం పరిమితులున్నాయనే విషయాన్ని విస్మరించకూడదు. ఆర్టికల్ 246 ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశాలపైనా పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. అయితే అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్టికల్ 368 ఎలాంటి చట్టాలు చేసేందుకైనా పార్లమెంటుకు అధికారం కల్పించింది. అయితే 1974లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 371(డి), 371(ఈ) అధికరణలు చేర్చారు. పార్లమెంటు చట్టాలు చేసే సమయంలో ఈ అధికరణలను మార్చడంగానీ, తొలగించడంగానీ చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఒకసారి రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపితే బిల్లు పూర్తిగా పార్లమెంటు, రాష్ట్రపతి అధికార పరిధిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఎవరూ జోక్యం చేసుకోలేరు. అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకోడానికి ఇదే సరైన సమయం.’’
అసెంబ్లీ తిరస్కరించింది: నారిమన్
‘‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి తెలంగాణ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించాయి. ఆ బిల్లునే కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. కోర్టు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని విభ జన ప్రక్రియపై స్టే విధించాలని కోరుతున్నాం. ఒక్కసారి ఈ బిల్లు చట్టంగా మారితే అప్పుడు కోర్టులు జోక్యం చేసుకోడానికి అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇక ఆర్టికల్ 371(డి), (ఈ) ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు జోనల్ రిజర్వేషన్లు కల్పిస్తోంది. అవేమీ పట్టించుకోకుండానే కేంద్రం విభజన ప్రక్రియపై ముందుకు పోతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేసింది. మూడేళ్ల క్రితం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇప్పటివరకు పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. రాష్ట్ర విభజన ఏ ప్రాతిపదికన జరుగుతుందో కేంద్రం చెప్పడంలేదు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినపుడు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా విభజన తీర్మానాన్ని ఆమోదించాయి. ఇక పంజాబ్ విభజన సందర్భంలోనూ ప్రభుత్వం ఓ కమిటీ వేసి దాని సూచనల ఆధారంగా విభజించింది. ఇప్పుడు మాత్రం అ విధానాలేమీ పాటించకుండానే విభజించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విభజన ప్రక్రియకు ఓ లీగల్ కమిటీ వేసి అది నిర్ణయించే అవకాశం కల్పించాలి. ’’
అసమగ్ర బిల్లు: పప్పు శ్యామల
‘‘అసెంబ్లీలో సభ్యులు విభజన బిల్లులోని ప్రతీ అంశంపై తమ అభిప్రాయం తెలపాల్సి ఉంటుంది. ఆ అభిప్రాయాలు రాష్ట్రపతి తీసుకునే నిర్ణయంపై ప్రభావం చూపుతాయి. విభజన బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోఅభిప్రాయం తెలిపే అవకాశం అందరు సభ్యులకు లభించలేదు. విభజన బిల్లులో ఉద్దేశాలు-లక్ష్యాలు, ఫైనాన్షియల్ మెమొరాండం వంటి కీలకాంశాలు లేవు. డ్రాఫ్టు బిల్లు అంత అసమగ్రంగా పంపితే అసెంబ్లీ అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేయగలుగుతుంది?’’
ఎందుకంత రహస్యం?: డి.ఎన్.రావు
‘‘సమాఖ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. అసెంబ్లీ ఆమోదం లేకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఏర్పడలేదు. ఒక్కసారి అసెంబ్లీ విభజన బిల్లును వ్యతిరేకిస్తే... విభజన ప్రక్రియను కొనసాగించే అధికారం కేంద్రం కోల్పోతుంది. విభజనకు సంబంధించిన చాలా అంశాలను బిల్లులో చేర్చకుండానే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి పంపారు. బిల్లు రూపకల్పనలో ఎందుకింతగా రహస్యం పాటించాల్సి వచ్చింది?’’
లోపాలున్న బిల్లు: ఎస్.రామచంద్రరావు
‘‘కేంద్రం కనీస అవగాహన లేకుండా విభజన ప్రక్రియపై ముందుకు వెళుతోంది. బిల్లులో కీలకమైన 4 అంశాలు లేవు కాబట్టి ఇది డ్రాఫ్టు బిల్లు మాత్రమే. ఇది లోపాలున్న బిల్లు అని అసెంబ్లీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. అసెంబ్లీ ఆమోదించిన సీఎం తీర్మానాన్ని కోర్టుకు సమర్పిస్తున్నాం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో ఇప్పటివరకు చెప్పలేదు. ఉమ్మడి రాజధాని అనే అంశంపైనా స్పష్టత లేదు.’’