మ్యాన్‌పవర్ ఏజెన్సీ టెండర్లపై అనుమానాలు !
భానుగుడి(కాకినాడ),న్యూస్‌లైన్:
జేఎన్టీయూకేలో ఇటీవల మాన్పవర్ ఏజెన్సీ నిర్వహణకు సంబంధించి పిలిచిన గ్లోబల్‌టెండర్ల విధానంపై వర్సిటీలోని ఒక వర్గం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. జూన్ 6న మూడు విభాగాలకు మూడు విధాలుగా వర్సిటీ అధికారులు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. 11మంది వేలందార్లు టెండర్ సమర్పించారు. ఇందులో మూడింటిని అనర్హంగా పేర్కొంటూ అధికారులు తొలగించారు. వర్సిటీ అధికారులు కోరిన అన్ని ధ్రువపత్రాలూ సమర్పించిన 8మందిని వేలందారులుగా ఎంపిక చేసి వారి బిడ్లను ప్రత్యేక కమిటీ పరిశీలించింది. ఇందులో వర్సిటీ ఆహ్వానించిన మూడు విభాగాలకు సాయి ఇన్విష్టిగేషన్ వేసిన మూడు బిడ్లు లాభదాయకంగా ఉండడంతో వేలంపాట సదరు సంస్థకు వచ్చినట్టు కమిటీ నిర్ధారించింది. అయితే మూడు ఏజెన్సీలకూ ఒకే సంస్థను అర్హమైనదిగా ఎంపిక చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందులో కుమ్మక్కు ఉండవచ్చని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులను కాదని, స్థానికేతర సంస్థకు వర్సిటీ రక్షణ బాధ్యతలను అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటోనని తర్కించుకుంటున్నారు. కాగా జేఏన్టీయూకేలో సెక్యూరిటీ బాధ్యతలకు +.36 శాతం, మాన్‌పవర్‌కు +.09 శాతం, ఈసీయూకేలో మాన్‌పవర్‌కు +.14 శాతం చొప్పున సదరు సంస్థ బిడ్లు సమర్పించిందని రిజిస్ట్రార్ జీవీఆర్ప్రసాదరాజు వెల్లడించారు. అన్ని అర్హతలూ పరిశీలించాకనే టెండర్ ఖరారు చేశామన్నారు. శ్రీ సాయి ఇన్విస్టిగేషన్, మాన్పవర్ సంస్థ వచ్చేనెల 1నుండి రెండేళ్లపాటు వర్సిటీలో ఈ మూడు విభాగాలకు కాంట్రాక్టు చేపడుతుందన్నారు.