50 ఏళ్ల క్రితం నాటి స్క్రిప్ట్‌తో స్పీల్బర్గ్ సినిమా
యాభై ఏళ్ల క్రితం నాటి స్క్రిప్ట్‌ను దుమ్ము దులిపి తెరకెక్కించే పనిలో పడ్డారు హాలీవుడ్ సంచలన దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఆ స్క్రిప్టు ఎవరిదంటే రచయిత డాల్టన్ ట్రంబోది. అమెరికా పార్లమెంట్‌ను ధిక్కరించారనే ఆరోపణలపై హాలీవుడ్లో పనిచేయకుండా ఆయన్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. డాల్టన్ ట్రంబో 50 ఏళ్ల క్రితం రాసిన ‘మాంటేజువా’ స్క్రిప్ట్‌ని స్పీల్బర్గ్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత జేవియర్ బార్డెమ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. అజ్టక్ సామ్రాజ్యాధినేత మాంటేజువా, స్పానిష్ రాజు హెర్నాన్ కార్టెజ్ల మధ్య విభేదాలు ప్రధానాంశంగా ట్రంబో ఈ కథ రాశారు. 1953లో విడుదలైన ‘రోమన్ హాలిడే’, 1956లో రూపొందిన ’ది బ్రేవ్ వన్’ చిత్రాలకు రచయితగా ట్రంబో రెండుసార్లు ఆస్కార్లు అందుకున్నారు. యూఎస్ కాంగ్రెస్‌ను ధిక్కరించారనే ఆరోపణలపై ట్రంబోకు అప్పట్లో 11 నెలల జైలుశిక్షను విధించారు.