బామ్మకు సలామ్...
92 ఏళ్ల వయస్సులో మారథాన్ పరుగు పూర్తి
సాండిగో: ముదిమి మీద పడిన తరుణంలో ఎవరైనా ఏం చేస్తారు. పుస్తకాలు చదువుతూనో.. చిన్నపిల్లలతోనో కాలక్షేపం చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన 92 ఏళ్ల బామ్మ హారియెట్ థామ్సన్ మాత్రం మనం ఊహించలేని ఫీట్ చేసి చూపించింది. సాండిగోలో ఏర్పాటు చేసిన 16వ రాక్ ఎన్ రోల్ మారథాన్‌ను ఏడు గంటల 24 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి అందరినీ అబ్బురపరిచింది.
నార్త్ కరోలినాలోని చార్లెట్‌కు చెందిన తను ఈ క్రమంలో మారథాన్ (42.195 కిలోమీటర్లు)ను పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళ (92 ఏళ్ల 65 రోజులు)గా రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు గ్లాడిస్ బురిల్ (92 ఏళ్ల 19 రోజులు) పేరిట ఉండేది. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ రేసు పూర్తి చేసేందుకు చాలామంది ప్రోత్సహించారు. నిజానికి ఈ ఏడాది నాకు విషాదాన్నే నింపింది. జనవరిలో నా భర్త చనిపోయారు. అందుకే నేను పెద్దగా శిక్షణ తీసుకోలేకపోయాను.
నా కుటుంబంలో చాలా మంది క్యాన్సర్ కారణంగా చనిపోయారు. నేను కూడా అలాగే చనిపోతాననుకున్నాను’ అని ఈ ప్రమాదకర వ్యాధి నుంచి కోలుకున్న హారియెట్ తెలిపారు. ల్యుకేమియా, లిమ్ఫోమా వ్యాధులపై పోరాడేందుకు నిధుల కోసం ఏడు పదుల వయస్సులో ఆమె తను పరుగును ప్రారంభించింది. గత 16 ఏళ్లలో ఆమె లక్ష డాలర్లను (రూ. 63 లక్షలు) సేకరించింది.