మార్డిలో దాహం.. దాహం
ఎండిపోయిన మంచినీటి బోర్లు
మార్డి గ్రామాస్తులకు తప్పని అవస్థలు
కల్హేర్: వర్షాకాలంలో సైతం నీటి కోసం కష్టాలు తప్పడం లేదు. మంచి నీటి పథకం బోర్లలో భూగర్భజలాలు వట్టిపోయాయి. దీంతో మండలంలోని మార్డి గ్రామాస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 3,500 జనాభా ఉన్న గ్రామాంలో మంచినీటి పథకం బోర్లు 10 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆరు బోర్లు ఎండిపోయాయి. నాలుగు సింగిల్ ఫేజ్ బోర్లు మాత్రమే పని చేస్తున్నాయి.
వీటిలో కూడా కొద్దిపాటి నీరు మాత్రమే వస్తోంది. నీటి కోసం సింగిల్‌ఫేజ్ బోర్ల వద్ద మహిళలు రాత్రిపగలు గంటల తరబడిగా ఖాలీ బిందేలు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. గత వేసవిలో వ్యవసాయ బోరును అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేశారు. వర్షకాలం రావడంతో రైతులు పంటలు సాగు చేశారు. దీంతో సాగుకు నీటి కష్టాలు వస్తాయన్న భయంతో ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి జంకుతున్నారు.
ప్రస్తుత సీజన్లో సరైన వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి మట్టం పెరగలేదు. దీంతో రైతులు బోర్లు అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అధికారులు, నీటి సమస్యను తీర్చేందుకు ప్రయత్నలు చేస్తున్నా ఫలించడం లేదు. నీటి సమస్య రోజురోజుకూ తీవ్రం కావాడంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామాస్తుల నుంచి చీవాట్లు తప్పడం లేదు.
నీటి కోసం సింగిల్ ఫేజ్ బోర్ల వద్ద రాత్రి పూట జాగారం చేస్తున్నారు. గ్రామంలోని ఏ వీధిలో చూసినా నీటి కోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ బోర్ల వద్దకు వెలితే రైతులు గొడవపడుతున్నారు. నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు.