వైఫైలా.. ఆయన చుట్టూ వివాదాలే
పని చేసిన చోటల్లా సెటిల్మెంట్లు.. అక్రమ వసూళ్లు
సన్నిహితులు, బినామీల పేరుతో ఆస్తులు
‘సిమ్స్’ కేసులో భారీ ముడుపులు
చేపల తిమ్మాపురంలో కళ్లు చెదిరే గెస్ట్‌హౌస్
ఏసీబీకి చిక్కిన హుస్సేన్ చరిత్ర ఇది
బోర్డు తిప్పేసి ఖాతాదారులను ముంచిన సిమ్స్ నుంచి భారీ ముడుపులు దండుకొని బాధితులను నిలువునా ముంచేశారు..
ఓ దొంగ నుంచి రికవరీ చేసిన కోట్లాది రూపాయల్లో చాలావరకు నొకేశారు..
టూ టౌన్.. త్రీటౌన్.. నరసన్నపేట.. ఇలా ఏ స్టేషన్లో పని చేసినా.. వైఫైలా వివాదాలు ఆయన చుట్టూ ముసురుకునేవి!..
కూతురు, కుమారుడు, అల్లుడు.. చివరికి సన్నిహితురాలి పేరిట కూడా అక్రమాస్తులు కూడబెట్టిన ఆ ఘనుడి పేరు హుస్సేన్..
పాపాల చిట్టా పెరిగి.. ఏసీబీకి చిక్కిన ఈ పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ సెటిల్మెంట్లలో దిట్టగా పేరుపొందారు..
విశాఖపట్నం:సామాన్య మధ్య తరగతి కుటుంబంలో విజయగనరం జిల్లా గరివిడి మండలం కోడూరులో పుట్టిన హుస్సేన్ హాస్టల్ వార్డెన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1991లో ఎస్సైగా ఎంపికై పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. పోలీస్ విధుల్లో రాటుదేలినట్లే.. అప్పటి నుంచి అవినీతిలో ఆరితేరారు. బినామీ పేర్లతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. చాలా కాలం పాటు నగరంలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఎక్కడికెళ్లినా వివాదాలతోనే సావాసం చేశారు. చివరికి ఏసీబీకి చిక్కారు.
‘సిమ్స్’ బాధితుల ఫిర్యాదులే ఆధారం
‘సిమ్స్’ అనే ఫైనాన్స్ సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి బోర్డు తిప్పేసింది. ఆ సమయంలో విశాఖ నగరంలో విధులు నిర్వర్తిస్తున్న హుస్సేన్ దాని నిర్విహకుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సిమ్స్ ఆస్తుల కేసు విచారణకు హుస్సేన్ ప్రత్యేకాధికారిగా పని చేశారు. ఆ సంస్థ డెరైక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి పలు ఆస్తులు సంపాదించారనే ఆరోపణలున్నాయి.
దాంతో సిమ్స్ బాధితులు హుస్సేన్ అక్రమాస్తులపై దృష్టి సారించారు. కొన్ని ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అధికారులు బుధవారం దాడులు, సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన హుస్సేన్ బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. ఎంత పిలిచినా మీడియా ఉన్నంత వరకూ ఆయన బయటకు రాలేదు.
12 బృందాలు.. 16 ప్రాంతాలు
ఏసీబీ అధికారులు 12 బృందాలుగా విడిపోయి నగరంలో 12 చోట్ల, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ముంబైలతో కలిపి మొత్తం 16 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేశారు. హుస్సేన్ నివాసం ఉంటున్న పాత సీబీఐ కార్యాలయ సమీపంలోని సాయిసదన్ అపార్ట్మెంట్, ముంబైలోని కుమార్తె, అల్లుడి ఇంటిలో, విజయనగరంలో తండ్రి, శ్రీకాకుళంలో మామ నివాసంలో దాడులు జరిగాయి.
హుస్సేన్ సన్నిహితురాలైన అనితను కూడా వదిలిపెట్టలేదు. ఆమె ఇంటిలోనూ తనిఖీలు చేశారు. పెందుర్తిలోని ముస్లిం కాలనీలో ఆమె పేరుపై ఓ ఫ్లాట్ ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం హుస్సేన్ అక్రమాస్తుల విలువ రూ.1.5 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.16 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కళ్లు చెదిరే ఆస్తులు
హుస్సేన్ ఆస్తుల్లో ఎక్కువ భాగం విల్లాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. పెందుర్తి సూర్యనగర్‌లో రెండు విల్లాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, స్విమ్మింగ్ పూల్తో సహా అన్ని సదుపాయాలు ఈ విల్లాలో ఉన్నాయి. మరో రెండింటిని కొనేందుకు ఆడ్వాన్స్ ఇచ్చారు. తిమ్మాపురం, శ్రీనగర్ కాలనీ, ఎండాడల్లోనూ ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో బయటపడింది.
కుమార్తె, కుమారుడి పేరు మీద పరవాడలో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్న విషయం బయటపడింది. ముంబైలోని అల్లుడి నివాసంలో జరిపిన సోదాల్లో ఓ లాకర్ బయటపడింది. దానిలో 400 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిసింది. అది తన తండ్రిదేనని కుమార్తె ఒప్పుకుంది. లాకర్ తెరవాల్సి ఉంది. ఇంకా పూడిమడక, దేశవానిపాలెం, నరవ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోందని, విచారణ జరుపుతామని డీఎస్పీ వెల్లడించారు.
పేదల ఇళ్లకు బినామీల పేరు
బీచ్ రోడ్డు కె.నగరప్పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు కేటాయించిన స్థలాలను తన సన్నిహితుడు, బినామీ అయిన శ్రీనివాస్ పేరుతో హుస్సేన్ కొనుగోలు చేసి అక్కడ డూప్లెక్స్ తరహాలో గెస్ట్‌హౌస్ నిర్మించారు. గెస్ట్‌హౌస్ తాళాలు తెరిచి లోపలికి వెళ్లిన ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్, జిమ్, సోఫాసెట్లు, లక్షలు విలువ చేసే ఎల్ఈడీ టీవీ, హోం థియేటర్, ఖరీదైన ఫ్రిజ్‌లు అక్కడ కనిపించాయి. కొన్ని ఫైళ్లు కూడా దొరికాయి.
ఆది నుంచీ వివాదాలే
నగరంలోని 2, 3, 4, 5వ పట్టణ పోలీస్ స్టేషన్లతోపాటు పెందుర్తి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటల్లో హుస్సేన్ విధులు నిర్వర్తించారు. పని చేసిన అన్ని చోట్లా ఆయన్ను అవినీతి, వివాదాలు వెంటాడాయి. త్రీ టౌన్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు ఓ దొంగ నుంచి కోట్లాది రూపాయలు రికవరీ చేసి వాటిని పక్కదారి పట్టించారని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. సెటిల్మెంట్లు చేసి ముడుపులు దండుకోవడంలోనూ దిట్ట అని తెలిసింది. కొందరు పోలీసు ఉన్నతాధికారుల అండదండలు కూడా హుస్సేన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె, కుమారుడు, బంధువులు, బినామీల పేర్లతో పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతూ ఆమె పేరుమీద కూడా ఆస్తులు సంపాదించారు.